సోమేశ్‌కుమార్‌ను బలిపశువును చేశారు
ఓట్ల తొలగింపు వ్యవహారంపై దత్తాత్రేయ
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ బదిలీకి కారణం ఓట్ల తొలగింపు వ్యవహారమేనని, ఆయన్ని ఇష్టానుసారంగా వాడుకొని చివరకు బలిపశువును చేశారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నగరంలోని అడిక్‌మెట్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ...‘సోమేశ్‌కుమార్‌తో పాటు నవీన్ మిట్టల్‌ను బలిపశువులను చేశారు. రాజకీయ నాయకులు, మంత్రులు చెప్పినట్లు అధికారులు నడుచుకోవద్దు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి.
తొలగించిన ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టడం దేశంలోనే ఇది రెండోసారి. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికిది సిగ్గుచేటు. 20 నెలల బీజేపీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు అన్నానికి బదులు బొగ్గు తిన్నారు’ అన్నారు. బాగ్‌లింగంపల్లి లంబాడ బస్తీలో త్వరలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అలాగే కార్మికులు అధిక సంఖ్యలో నివసించే ముషీరాబాద్ నియోజకవర్గంలో 6 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.