బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మణ్
పార్టీ నాయకత్వం ప్రకటన
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కె.లక్ష్మణ్‌ను నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం శుక్రవారం ప్రకటన చేసింది. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్షానికి నాయకత్వం వహిస్తున్న లక్ష్మణ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్యనేతలు పోటీ పడినా సీనియారిటీ, అంకితభావాన్ని ప్రాతిపదికగా చేసుకుని లక్ష్మణ్ వైపు జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది.
ఇప్పటిదాకా పార్టీకి రాష్ట్ర సారథులుగా రాజధాని హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువకాలం పనిచేశారు. ఈసారైనా గ్రామీణ ప్రాంతానికి చెందిన నాయకులకు అవకాశం ఇవ్వాలని జిల్లాల నేతలు పట్టుబట్టారు. 2019 ఎన్నికలను నడిపించాల్సిన ముఖ్యమైన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని, పార్టీని తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బలోపేతం చేసే బాధ్యతను లక్ష్మణ్‌పై జాతీయ నాయకత్వం పెట్టింది. దీనితో జిల్లాలకు చెందిన కొందరు నేతలు నిరాశకు గురయ్యారు.
లక్ష్మణ్ నేపథ్యం ఇదీ..
డాక్టర్ కె.లక్ష్మణ్ హైదరాబాద్ నగరానికి చెందిన ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీ సైన్స్ కాలేజీ విద్యార్థి యూనియన్‌కు 1978-80 మధ్యకాలంలో ఎన్నికయ్యారు. 1982-86 మధ్యకాలంలో రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జియాలజీలో డాక్టరేట్ తీసుకున్నారు. 1980లో బీజేపీలో చేరిన లక్ష్మణ్ పార్టీ హైదరాబాద్ శాఖకు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశారు. రాష్ట్ర పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగానూ సేవలందించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా 2010-2013 మధ్యకాలంలో పనిచేశారు. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 1994 నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా పోటీ చేస్తున్నారు. 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. పార్టీలో సీనియర్‌గా, ప్రజాప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన నాయకునిగా లక్ష్మణ్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది.
దత్తాత్రేయ హర్షం
డాక్టర్ కె.లక్ష్మణ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం సంతోషదాయకమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. లక్ష్మణ్ నాయకత్వంలో పార్టీ బలంగా ఎదుగుతుందనే విశ్వాసముందన్నారు. అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు లక్ష్మణ్‌కు సహకరించాలని దత్తాత్రేయ కోరారు.