గ్రామాల్లో పార్టీ పటిష్టతే లక్ష్యం: కె.లక్ష్మణ్
ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ
సీనియర్లను, జూనియర్లను కలుపుకుని ముందుకెళతాం
ప్రభుత్వ పథకాలపై కార్యకర్తల ద్వారా విస్తృత ప్రచారం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన అధ్యక్షుడు కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సైతం పార్టీని పటిష్టం చేస్తానని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీకి సిద్ధాంతపరమైన, బలై మెన నిర్మాణం ఉందని పేర్కొన్నారు. పార్టీలో సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేసుకుని వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం లక్ష్మణ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు?
లక్ష్మణ్: పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నాపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతలు అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తాను. కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా, సీనియర్ నాయకుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని పని చేస్తాను. మొత్తంగా తెలంగాణలో 2019 నా టికి బలీయమైన శక్తిగా, ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను.
పార్టీ పగ్గాలను మీకు అధిష్టానం అప్పగించడాన్ని ఎలా చూస్తారు?
లక్ష్మణ్: భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. మిగతా పార్టీల మాదిరిగా వారసత్వాలకు చోటు ఉండదు. ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో పని చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను కూడా కార్యకర్తతో మొదలుకుని ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడితో పాటు వివిధ విభాగాల్లో పనిచేశాను. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. పార్టీ జాతీయ అధ్యక్షుని ఆదేశాలను శిరసావహిస్తాను.
సీనియర్లు, జూనియర్లను ఎలా కలుపుకుని వెళ్తారు?
లక్ష్మణ్: బీజేపీకి సిద్ధాంతపరమైన బలమైన నిర్మాణం ఉంది. ఎవరైనా అందుకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. పార్టీలో సీనియర్ల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, జూనియర్లను కలుపుకుని ముందుకెళ్తాను. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.
మీ ముందున్న కర్తవ్యం, బాధ్యత ఏమిటి?
లక్ష్మణ్: ప్రధానంగా పార్టీని సంస్థాగతంగా గ్రామగ్రామానా బలోపేతం చేయాలి. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగరాలి. అలాగే కేం ద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. వాటిని కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం.