
డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి
► విద్యార్థినిపై నలుగురు డిగ్రీ విద్యార్థుల లైంగిక దాడి
► వీరంతా సహాధ్యాయులే
► సెల్ ఫోన్‌లో వీడియో చితీక్రరణ
► యూట్యూబ్‌లో పెడతామని బెదిరింపులు
► బాధితురాలి ఫిర్యాదుతో నిర్భయ కేసు నమోదు
ఖమ్మంక్రైం: ఖమ్మంలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై ఆమె సహాధ్యాయులైన ముగ్గురు విద్యార్థులు లైంగిక దాడి చేశారు. దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. యూట్యూబ్‌లో పెడతామని బెదిరించారు. ఆమె ఫిర్యాదుతో ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు... నగరంలోని ట్రంక్ రోడ్డులోగల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థిని డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అఖిల్, రాధాకృష్ణ, కార్తీక్, ఉదయ్... ఈ నలుగురూ ఆమె సహాధ్యాయులు. ఆమె అఖిల్‌తో చనువుగా ఉండేది.
ఈ నెల 1న తన పుట్టిన రోజని, తన గదిలో బర్త్‌డే పార్టీ ఉంటుందని ఆమెకు, మిగతా ముగ్గురికి రాధాకృష్ణ చెప్పాడు. పార్టీకి రావాల్సిందని ఆహ్వానించాడు. వారందరూ కలిసి త్రీ టౌన్ ప్రాంతంలోగల పీఎస్‌ఆర్ రోడ్డులోని రాధాకృష్ణ గదికి వెళ్లారు. బర్త్‌డే పార్టీ పూర్తయిన తర్వాత ఆమెపై రాధాకృష్ణ, అఖిల్, ఉదయ్ లైంగిక దాడి చేశారు. ఆమె ఎంతగా వారించినా, ఎదిరించినా, బతిమిలాడినా వినలేదు. అరిస్తే అక్కడికక్కడే చంపుతామని బెదిరించారు. తన స్నేహితులు లైంగిక దాడి చేస్తుండడాన్ని కార్తీక్ తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఆ తరువాత, అతడు కూడా లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత, ఆమె రోదిస్తూ ఇంటికి వెళ్లింది.
రెండు రోజులపాటు ముభావంగా ఉంది. ఏదో తేడాగా ఉండడంతో తల్లికి అనుమానమొచ్చింది. ధైర్యం చెప్పి, అనునయంగా అడిగింది. ఆ విద్యార్థిని రోదిస్తూ, ఆమెపై నలుగురు స్నేహితులు అత్యాచారం చేసి దాన్ని వీడియో తీసి.. రమ్మన్నప్పుడల్లా వచ్చి తమ కోర్కె తీర్చాలంటూ బెదిరించడం మొదలుపెట్టారని జరిగినదంతా వివరించింది. ఆ తల్లి, తన కూతురితో కలిసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. ‘లైంగిక దాడి’, ‘నిర్భయ’ కేసులను ఆ నలుగురు డిగ్రీ విద్యార్థులపై సీఐ వెంకన్నబాబు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు, మరొకడు పరారీలో ఉన్నట్టు తెలిసింది.