- సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఎస్సైలు
- కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు
పోగొట్టుకున్న డబ్బు అప్పగింత
Published Wed, Sep 21 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
కురవి : ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధ రైతు పోగొట్టుకున్న డబ్బును పోలీసులు తిరిగి అప్పగించారు. ముగ్గురు ఎస్సైలు సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుడు చేజార్చుకున్న నగదును ఆయనకు అందజేసి సేవా దృ క్పథాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. కురవి ఎస్‌సై టి.అశోక్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మరిపెడ మండలంలోని గుండెపూడికి చెందిన వృద్ధ రైతు బింగి అయిలయ్య పల్లి విత్తనాలను కొనుగోలు చేసుకునేందుకు ఉదయం నల్లగొండ జిల్లా సూర్యాపేటకు వెళ్లాడు. ఈ మేరకు ఆయన ఇంటి నుంచి రూ.30 వేల నగదును తీసుకెళ్లాడు.
అయితే సూర్యాపేటలో పల్లి విత్తనాలు దొరకకపోవడంతో సాయంత్రం డబ్బులను పంచెలో పెట్టుకుని ఇంటికి బయలుదేరేందుకు సూర్యాపేటలో మానుకోట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ సందర్భంగా అయిలయ్య మరిపెడ మండలంలోని బుర్హా¯ŒSపురంలో దిగేందుకు టికెట్ తీసుకున్నాడు. సాయంత్రం బస్సు బుర్హా¯ŒSపురం గ్రామానికి చేరుకోవడంతో ఆయన బస్సు దిగాడు. అనంతరం తన పంచెలో పెట్టుకున్న డబ్బులను చూసుకోగా కనిపించలేదు. దీంతో లబోదిబోమంటుండగా.. గమనించిన బుర్హా¯ŒSపురం గ్రామస్తులు వెంటనే మరి పెడ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమం లో ఎస్‌సైలు నరేష్, నందీప్ స్థానిక బస్టాండ్ వద్ద బస్సుల్లో తనిఖీ చేశారు. కాగా, సూర్యాపేట నుంచి వచ్చిన బస్సు కురవి వైపునకు వెళ్లిందని తెలుసుకుని వారు అక్కడి ఎస్‌సై అశోక్‌కు సమాచారం అందజేశారు. వెంటనే ఆయన కురవి గుడి సెంటర్‌లో సూర్యాపేట వైపు నుంచి వస్తున్న బస్సులను నిలిపివేసి తనిఖీ చేయగా అయిలయ్య కూర్చున్న సీటు కింద రూ.30 వేలు దొరికాయి. దీంతో దొరికిన డబ్బులను ఆయన బాధితుడికి అందజేశారు. కాగా, తాను పోగొట్టుకున్న డబ్బులను తిరిగి అప్పగించేందుకు కృషి చేసిన ఎస్సైల కు అయిలయ్య కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement