మంత్రి రావెలపై కేసు నమోదుకు డిమాండ్
మంత్రి రావెలపై కేసు నమోదుకు డిమాండ్
Published Mon, Mar 6 2017 12:06 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి రావెల కిశోర్‌బాబుపై కేసు నమోదు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే జిల్లాలో అధికార పర్యటనలు చేయకూడదని స్పష్టంగా నిబంధనలున్నాయన్నారు. వీటిని కాదని గత శనివారం మంత్రి రావెల పర్యటించడంతోపాటు గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేజేరెడ్డి ఇంట్లో సమావేశమైనా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వెంటనే రావెలను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
విపక్ష పార్టీల అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తుంటే చర్యలు తీసుకునే జిల్లా ఉన్నతాధికారులు మంత్రులు, టీడీపీ నాయకులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో టీడీపీ అభ్యర్థి ప్రచార పోస్టర్లను ఉంచినా తొలగించడం లేదన్నారు. జిల్లా అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు ఓటర్లను డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారుల్లో చలనం లేదన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు గఫూర్ తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా అధ్యక్షుడు కే.ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.
Advertisement