విజయవాడ : నందిగామ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్, దళత సంఘాల ఫోరం ఆహ్వానం మేరకు శనివారం నగరంలోని ఏపీ స్టడీ సర్కిల్ (అంబేద్కర్ బాబూ జగజ్జీవన్‌రామ్ భవన్)ను ఆయన సందర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం కార్యక్రమాలపై మాట్లాడనని చెప్పారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండలాని కోరుతూ తెలుగుదేశం నాయకులు అనేక ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేసినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో లైట్లు ఆపేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని విమర్శించారు. స్థానిక సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయంలో ఏపీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి కృషి చేసిందని చెప్పారు. ప్రస్తుతం విరిగిపోయిన కూర్చీలు, బల్లలు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుందని విమర్శించారు. నందిగామ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై సంప్రదాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌పార్టీ పోటీకి పెట్టిందన్నారు. పీవీ నరసంహారావు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగుదేశం పోటీకి పెట్టలేదని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మరణించినప్పుడు పులివెందులలో టీడీపీ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. సానుభూతి, సంప్రదాయలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఓట్లు కూడా రావని తెలిపారు. ఏపీ స్టీడీ సర్కిల్ అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్పొరేటర్లు కె.శైలజ, ఎన్.జగదీష్, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు జి.గాంధీ, డాక్టర్ నానయ్య, పరమేశ్వరరావు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌వి నీచ రాజకీయాలు : బచ్చుల
నందిగామ : కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు ఆరోపించారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందన్నారు. ఎమ్మెల్యేగా ఉండి అకాల మరణం చెందిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీ లేకుండా వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. పార్టీ అభ్యర్థి సౌమ్యకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
అభ్యర్థి తంగిరాల సౌమ్య, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండల పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు, కె.వి.సాంబశివరావు, ఐలూరి శ్రీనివాసరెడ్డి, వీరులపాడు ఎంపీపీ పాటిబండ్ల జయపాల్, శాఖమూరి స్వర్ణలత, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఏపీ స్టడీ సర్కిల్ అభివృద్ధికి చర్యలు
Published Sun, Aug 31 2014 2:26 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement