అనంతపురం ఎడ్యుకేషన్ : అక్రమ బదిలీల కోసమే ప్రభుత్వం టీచర్ల సాధారణ బదిలీలను ఆలస్యం చేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాబురెడ్డి ఆరోపించారు. స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యా సంవత్సరానికి ఆటంకం కల్గకుండా వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు జరపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఒకే సిలబస్, ఒకే పరీక్ష విధానం అనేది రాష్ట్రాల హక్కులు దెబ్బ తీయడమేనన్నారు. స్థానిక పరిస్థితులను గమనించకుండా డిటెన్షన్ విధానం అమలు చేయడం వల్ల డ్రాపౌట్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం. సుధాకర్, ప్రధానకార్యదర్శి ఎస్‌వీవీ రమణయ్య, గౌరవాధ్యక్షులు నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.