ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తుందుర్రు నుంచి తరలించాలి
Published Thu, Nov 17 2016 12:43 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
నరసాపురం : తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తుందుర్రు నుంచి తరలించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ డిమాండ్ చేశారు. తుందుర్రు రొయ్యల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అంబేడ్కర్ సెంటర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 44వ రోజుకు చేరాయి. బుధవారం దీక్షల్లో బలరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 గ్రామాల ప్రజలు నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 1972లో జలకాలుష్య నిర్మూలనపై చట్టం చేసినా, నేటి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీక్షా శిబిరాన్ని సర్వోదయ రైతు సంఘం నాయకుడు డాక్టర్ శిరిగినీడి నాగభూషణం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన పోరాడాలని కోరారు. దీక్షల్లో ఎం.త్రిమూర్తులు, యడ్ల చిట్టిబాబు, పొగాకు నారాయణరావు, కాకిలేటి ప్రసాద్, తెలగంశెట్టి సత్యనారాయణ కూర్చున్నారు.
సీపీఎం పాదయాత్ర వాయిదా
ఏలూరు(సెంట్రల్): గొంతేరు, యనమదుర్రు, గోస్తనీ, కొల్లేరు జీవనదులు, భూగర్భ జలాల కాలుష్యంపై నిర్వహించనున్న ప్రజాభేరి పాదయాత్ర వాయిదా వేసినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేసినట్టు చెప్పారు. తిరిగి పాదయాత్ర ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Advertisement