
నోట్ల రద్దు నిర్ణయం విప్లవాత్మకం
తిరువూరు : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్ సమర్థించుకున్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శనివారం యువమోర్చా కార్యకర్తల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రధానిగా తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం విచారకరమన్నారు. ప్రస్తుతం బ్యాంకులకు, ఏటీఎంలకు చాలినన్ని కరెన్సీ వచ్చినందున ఇకపై ప్రజలు బారులు తీరి నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో కలిగే ప్రయోజనాలను బీజేవైఎం కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దారా మాధవరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సింహాచలం, ప్రకాశరావు పాల్గొన్నారు.