డెమో రైలు పెండ్లిమర్రి వరకు ..
నంద్యాల: నంద్యాల–కడప డెమో రైలును కడప సమీపంలోని పెండ్లిమర్రి వరకు కొనసాగిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డెమో రైలు నేటి నుంచి పెండ్లిమర్రి వరకు వెళ్తుంది. గత ఏడాది ఆగస్టులో నంద్యాల, ఎర్రగుంట్ల రైల్వే లైన్‌పై నంద్యాల–కడప డెమో రైలును ప్రారంభించారు. ఈ రైలు రోజుకు రెండు సార్లు ఈ మార్గంలో తిరుగుతుంది. అయితే కడప–బెంగళూరు కొత్త రైలు మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కడప–పెండ్లిమర్రి వరకు పనులు పూర్తి కావడంతో, డెమో రైలును పొడిగించారు.ఈ రైలు నంద్యాల నుంచి ఉదయం 6గంటలకు బయల్దేరి 9.55కు కడపకు, అక్కడి నుంచి 10.55కు పెండ్లిమర్రిని చేరుతుంది. తిరిగి 11.20గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.20కి నంద్యాల చేరుతుంది. 3.30కి బయల్దేరి సాయంత్రం 7.20కి కడపకు, 7.40కి పెండ్లిమర్రికి చేరుతుంది. 7.50కి అక్కడి నుంచి బయల్దేరి అర్ధరాత్రి 12గంటలకు నంద్యాలకు చేరుతుంది.
డెమో రైలు ప్రయాణం ఆలస్యం
నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే పనులు పూర్తై, డెమో రైలు తిరుగుతున్నా రైల్వే అధికారులు వేగాన్ని 30కే పరిమితం చేశారు. గతంలో పగలు తిరిగే రైలును 60కి.మీ, రాత్రి కడప నుంచి నంద్యాలకు వచ్చే సర్వీసును 30కి.మీకి తిప్పేవారు. దీంతో పగలు తిరిగే రైళ్లతో త్వరగా గమ్యానికి చేరుకునేవారు. వేగం తగ్గించడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో రైతు ప్రయాణానికి చాలా సమయం పడుతుంది.