యలమంచిలి : సోమలింగపాలెం గ్రామస్తులను జ్వరాలు వదలడంలేదు. డెంగీతో పాటు విషజ్వరాలు గ్రామస్తులను వణికిస్తున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలో చిన్నారి దొడ్డి అంబిక (3), యువకుడు రీసా లక్ష్మణ్ (28) జ్వరాలతో మత్యువాత పడ్డారు. అంబిక డెంగీ వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రీసా లక్ష్మణ్ జ్వరంతోనే చనిపోయినప్పటికీ డెంగీ అని నిర్ధారించలేదు. 15 రోజులు కావస్తున్నా గ్రామంలో జ్వరాలు అదుపులోకి రాలేదు. తాజాగా ముగ్గురు చిన్నారులు డెంగీ లక్షణాలతో అనకాపల్లి, గాజువాకల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన కాండ్రేగుల రాజేష్, జ్ఞానేష్ అనే చిన్నారులు డెయిరీ ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. పుష్కల్ అనే ఏడాదిన్నబాలుడు , తొమ్మిది నెలల చిన్నారి అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిల్లో పిల్లలందరికీ డెంగీ లక్షణాలు ఉన్నట్టు తల్లిదండ్రులు చెప్పారు. తమ వద్ద ఇందుకు సంబంధించి నివేదికలు కూడా ఉన్నాయని కర్రి శివ అనే వ్యక్తి చెప్పారు. డెంగీగా ప్రైవేట్ వైద్యులు చెబుతున్నప్పటికీ దిమిలి పీహెచ్‌సీ వైద్యురాలు, సిబ్బంది మాత్రం అవి డెంగీ జ్వరాలు కావని చెబుతుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెంగీ కాదని ఎలాంటి ఆధారాలున్నాయో చెప్పాలని గ్రామస్తులు వారిని నిలదీస్తున్నారు.
క్షీణించిన పారిశుధ్యం
సోమలింగపాలెం గ్రామంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. గ్రామంలో ప్రధాన రహదారి సహా ఎక్కడ చూసినా రోడ్లన్నీ మురుగునీటితో బురదమయంగా ఉంటున్నాయి. దీనికి తోడు చినుకులు పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. రోడ్లపై గుంతల్లో నిల్వ ఉంటున్న మురుగునీరుతో దోమలు వద్ధి చెంది డెంగీ, మలేరియా, టైఫాయిడ్, జ్వరాలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సరైన వైద్యం అందే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సోమలింగపాలాన్ని వదలని జ్వరాలు
Published Mon, Jul 25 2016 12:37 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement