హైడ్రామా
-
డీఈఓ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (టౌన్) : నూతన జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైన మువ్వా రామలింగం బాధ్యతల స్వీకరణ హైడ్రామా మధ్యన సాగింది. బుధవారం ఉదయం 7 గంటలకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించేందుకు రామలింగం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోని డీఈఓ చాంబరులో ఆశీనులై రిజిస్టర్‌లో సంతకం చేశారు. అనంతరం అభినందనల కార్యక్రమాల్లో మునిగిపోయారు. అయితే ఇన్‌చార్జి డీఈఓ విజయలక్ష్మి ఆయనకు బాధ్యతలు అప్పగించలేదు. కలెక్టర్ ముత్యాలరాజు సాయంత్రం వరకు వేచి ఉండాలని సూచించినట్లు తెలిసింది. రామలింగానికి సంబంధించిన గత రికార్డులను తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. రామలింగంకు పోస్టింగ్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సైతం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. అయితే జిల్లా మంత్రి నారాయణ విద్యాశాఖ మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో విధిలేని పరిస్థితుల్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రామలింగానికి డీఈఓ బాధ్యతలను ఇన్‌చార్జి డీఈఓ విజయలక్ష్మి సాయంత్రం 5గంటలకు అప్పగించారు. కాగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన మువ్వాకు పలువురు అభినందనలు తెలిపారు. బీసీ సంఘం నేతలు కార్యాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నాయుకులు అభినందనలు తెలిపారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం మాత్రం అభినందలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిచడమే తన లక్ష్యమని డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన మువ్వా రామలింగం తెలిపారు. ఐఐటీ ఫౌండేషన్ అమల్లో జిల్లాలను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వచ్చే ఏడాది 3లక్షలకుపైగా విద్యార్థులు చదివేలా కృషి చేస్తామన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, మౌలిక వసతుల కల్పనపై తల్లిదండ్రులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే ఉత్తమ విద్య అందుతుందన్నారు.