తెరపైకి డిప్యూటేషన్‌ల ‘పంచాయితీ’! | deputation issue in panchayat raj office | Sakshi
Sakshi News home page

తెరపైకి డిప్యూటేషన్‌ల ‘పంచాయితీ’!

Published Sun, Jul 16 2017 10:26 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

తెరపైకి డిప్యూటేషన్‌ల ‘పంచాయితీ’! - Sakshi

తెరపైకి డిప్యూటేషన్‌ల ‘పంచాయితీ’!

– ప్రజాప్రతినిధుల పంచన అక్రమార్కులు
– అరకొర పనుల్లో కూడా నాణ్యతకు తిలోదకాలు
– చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు


ఒక డీఈ రాయదుర్గానికి బదిలీపై వెళ్లారు. ఆ స్థానంలో డిప్యూటేషన్‌పై ఉన్న డీఈ నేటికి అక్కడే విధుల్లో కొనసాగుతున్నారు. శాఖ ఉన్నతాధికారులు డిప్యూటేషన్‌పై వెళ్లిన డీఈని తన స్థానానికి పంపకుండా చోద్యం చూస్తున్నారు. ఇక ఎస్‌ఈ పీఏగా విధులు నిర్వహించాల్సిన వ్యక్తి తాడిపత్రి, శింగనమల ప్రాంతాలకు డీఈగా వ్వవహరిస్తున్నారు. ఇది కేవలం ఏ ఇద్దరి, ముగ్గురి సమస్య కాదు...ఈ శాఖలో కాసులు కోసం ఎక్కడిదాకైనా వెళతారనడానికి ఇవే నిదర్శనం.

అనంతపురం సిటీ : పంచాయతీరాజ్‌శాఖలో మళ్లీ డిప్యూటేషన్‌ల గోల మొదలైంది. స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ గాడితప్పుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నేతల పంచన చేరి అందిన కాడికి  దండుకుంటున్నారు. అక్రమ మార్గాల్లో జేబులు నింపుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ‘అనంత’లో ఈ దోపిడీ తారస్థాయికి చేరింది. పాలకుల స్వార్థం, కొందరు అధికారుల కక్కుర్తి వెరసి నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు.  ప్రధానంగా ఉద్యోగుల్లో బలమైన సామాజిక వర్గానిదే ఇక్కడ పెత్తనం సాగుతోంది. సామాన్య ఉద్యోగులు నోరు మెదపలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

నేతల పంచన అక్రమార్కులు
ప్రజాప్రతినిధుల పంచన చేరి కొందరు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తూ కావాల్సిన చోటుకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ క్రమంలో కింది స్థాయి సిబ్బంది మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతగా అంటే ఒకరినొకరు కొట్టుకునేందుకు వెనకాడని స్థాయికి దిగజారిపోయాయి. ఇదే అదనుగా భావించిన కొందరు జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్‌లు కూడా డిప్యూటేషన్‌లపై వెళ్లాలని పట్టుబడుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  కొంతమంది అధికారులు నేతల పంచన చేరి పనుల్లో పర్సేంటేజీల శాతాన్ని ఎక్కువ మొత్తంలో పంచుకుతినేందుకు అలవాటుపడ్డారు. వీరు పనులు ఎక్కడ జరిగితే...అక్కడికి వాలి పోతారు. ఏ స్థానానికి వెళ్లాలన్నా స్థానిక నేతలను ప్రసన్నం చేసుకోవడమే వీరికి పెట్టుబడి. అనంతరం టెండర్లు వేయించడం మొదలు.. పనులను అతి తక్కువ ఖర్చులో ఎలా ముగించాలో కూడా వారే నేతలకు సూచిస్తారు. కాకపోతే వాటాల్లో తేడాలుంటాయి. తాజాగా ఈ డిప్యూటేషన్‌ల విషయంలో ఓ ప్రజాప్రతినిధి డీఈ స్థాయి అధికారిని కార్యాలయానికి వచ్చి మరీ బెదిరించారని తెలిసింది. తాను సూచించిన వారిని డిప్యూటేషన్‌ పంపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం.

నాణ్యతకు తిలోదకాలు
ఈ శాఖ పరిధిలో జరుగుతున్న, జరిగిన రహదారుల నిర్మాణాల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం వేసిన రహదారులు కూడా గుంతలు పడి ప్రయాణానికి అసౌకర్యంగా మారాయి. కోట్లాది రూపాయల నిధులను ఇలా దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపుకునే సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కలెక్టర్‌ స్థాయి అధికారులు ఈ శాఖవైపు దృష్టి సారించడం అరుదుగా ఉంటుంది. ఇక ఏసీబీ, విజిలెన్స్‌ అధికారుల పనితీరు కూడా ఈ శాఖపై పెద్దగా ప్రభావితం చేయడం లేదు. చాలా విషయాల్లో విజిలెన్స్‌ అధికారులను సైతం సర్దుబాటు చేసిన ఆరోపణలున్నాయి.

కొసమెరుపు:
డిప్యూటేషన్‌లను రద్దు చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు చేసి రెండు నెలలు కూడా గడవక ముందే మళ్లీ డిప్యూటేషన్‌ల గోల మొదలు కావడం కొసమెరుపు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement