డీఈఓ కార్యాలయంలో డెప్యుటేషన్ల మాయ
అనంతపురం ఎడ్యుకేషన్
డెప్యుటేషన్ పేరుతో కొందరు టీచర్లు ఏళ్ల తరబడి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తిష్ట వేశారు. అధికారులు వారిని ఓవైపు రిలీవ్ చేశామని చెబుతూనే మరోవైపు ‘అవసరం’ పేరుతో తిరిగి తీసుకుంటున్నారు. డెప్యూటేషన్లపై పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న డెప్యూటేషన్లు రద్దు చేసి స్కూళ్లకు పంపాలనేది నిబంధన.
ఇది డీఈఓ కార్యాలయంలో అమలుకావడం లేదు. పరీక్షల విభాగంలో పనిచేస్తున్న టీచరుతోపాటు ఆర్‌ఎంఎస్‌ఏలో పనిచేస్తున్న మరో టీచరును రిలీవ్ చేశారు. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ వారు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ వీరు కనిపించడంతో అక్కడి ఉద్యోగులు కంగుతిన్నారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు టీచర్లపై నవంబర్‌లో పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యా యి. దీనిపై స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఏ ఒక్క టీచరు డీఈఓ కార్యాలయంలో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు కూడా బుట్టదాఖలా అయ్యాయి.
ఆదాయ వనరుగా మారిన వైనం..
డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు టీచర్లు అధికారులకు మంచి ఆదాయ వనరుగా మారారు. ఈ కారణంగానే వారిని బయటుకు పం పేందుకు ఇష్టపడడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పరీక్షల విభాగంలో పనిచేస్తున్న ఓ టీచరు సుమారు 20 ఏళ్లుగా ఇదే విభాగంలో కొనసాగుతూ చక్రం తిప్పుతున్నారు. పరీక్షల విభాగం సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు సైతం ఈయన చెప్పినట్లే వినాల్సిన పరిస్థితి. పరీక్ష సెంటర్ల కేటాయింపు, సీఎస్, డీఓలు, ఇన్విజిలేటర్ల కేటాయింపు ఇలా ప్రతిదీ ఆయన ద్వారానే సాగుతోంది. ముఖ్యంగా పదో తరగతి సెంటర్ల కేటాయింపు, మూల్యాంకనం సందర్భాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
నోట్‌ఫైల్ లేకుండానే: ఒక టీచర్‌ను డెప్యుటేషన్‌పై తీసుకోవాలంటే కచ్చితంగా ఫైల్ రన్ చేసి తీసుకోవాలి. సంబంధిత సెక్షన్ సూపరిం టెండెంట్ ద్వారా నోట్‌ఫైల్ సిద్ధం చేసి నేరుగా ఏడీకి అక్కడి నుంచి డీఈఓకు పంపి తర్వాత కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాతనే తీసుకోవాలి. పరీక్షల విభాగంలో పనిచేస్తున్న టీచరు విషయంలో ఎలాంటి నోటిఫైల్ లేకుండా నేరుగా ఓ అధికారి ఆమోదముద్ర వేసి తీసుకోవడం కోసమెరుపు.