నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచండి
– జిల్లా అధికారులకు కలెక్టర్ సూచన
కర్నూలు (అగ్రికల్చర్): నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ఆయా శాఖల్లో జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఆన్‌లైన్ లావాదేవీలకు చేపడితే ఆదర్శంగా ఉంటుందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డులు ఉపయోగించవద్దని, వీటిని ఉపయోగించడంతో అప్పుల భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెబిట్ కార్డులను, రూపే కార్డులతో మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. నగదు రహిత లావాదేవీల అంశాన్ని ప్రతి జిల్లా అధికారి సీరియస్‌గా తీసుకొని, సిబ్బందిని అప్రమత్తం చేసి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాకు అవసరమైనన్ని పీఓపీ మిషన్లు, మినీ మైక్రో ఏటీఎంలు వస్తున్నాయని, జిల్లా అంతటా నగదు రహిత లావాదేవీలు నిర్వహిçస్తే నగదు కొరత నుంచి బయటపడవచ్చని సూచించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సీపీఓ ఆనందనాయక్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.