
అశ్వత్థంలో పోటెత్తిన భక్తులు
మాఘ మాసం మూడు ఆదివారాన్ని పురస్కరించుకుని పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరావడంతో క్షేత్రం కిటకిటలాడింది. శనివారం రాత్రి నుంచే జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తుల రాక మొదలైంది. ఎడ్లబండిపై వచ్చిన గ్రామీణ ప్రజలు పెన్నానదిలో విడిది చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకే భక్తులు స్నానమాచరించి అశ్వత్థనారాయణస్వామి, భీమలింగేశ్వరస్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు.
మొక్కుబడి ఉన్న భక్తులు తలనీలాలు సమర్పించారు. పాలుపోంగలి చేసి స్వామివార్లకు నైవేద్యం సమర్పించారు. తిరునాలలో తినుబండరాలు, ఆటవస్తువులు, గాజుల దుకాణాలు వెలిశాయి. ఈ సందర్భంగా చెక్కభజన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. భఎలాంటి ఆవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాడిపత్రి డీఎస్సీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు సురేంద్రనాథ్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, ఎస్‌ఐలు శ్రీహర్ష, నారాయణరెడ్డి, ప్రదీప్ పర్యవేక్షించారు. వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది.
- తాడిపత్రి రూరల్