పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సోమవారం మీడియా పాయింట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలంలో 860 అడుగులు ఉందని, నాగార్జునసాగర్ నుంచి 5,046 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారని తెలిపారు.
పవర్ హౌస్ నుంచి కిందికి 3,884 క్యూసెక్కులు వదులుతుండగా పులిచింతల నుంచి 10,900 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారన్నారు. పులిచింతల వద్ద 7,800, కీసర వద్ద 1500 మొత్తం కలిపి 9,300 ఇన్‌ఫ్లో ఉందని చెప్పారు. సాగర్‌లో 5 టీఎంసీలు, పులిచింతలలో 2.7 టీఎంసీల కృష్ణాజలాలు ఉన్నాయని, వీటిని ప్రకాశం బ్యారేజ్ ద్వారా కాల్వలకు వదులుతామని చెప్పారు. ఇది కాకుండా పట్టిసీమ వద్ద గండి పూడ్చే పనులు జరుగుతున్నాయని, 11వ తేదీ నాటికి గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణనదిలో ఫెర్రిలోని పవిత్ర సంగమం వద్ద కలుస్తాయని చెప్పారు.
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం విషయంలోనూ కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఉమా ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే జాతిపితకు అవమానం జరగడాన్ని జీర్ణించుకోలేని దేవినేని ఉమా దీనిపై ఎదురుదాడికి దిగారు. విగ్రహం కాల్వలో పడవేయడం, దీనిపై కేవలం ఒక చానల్, ఒక పత్రికకే సమాచారం అందడంపై అనుమానం ఉందన్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారన్నారు. బొత్స సత్యనారాయణ జాతిపిత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండగా ప్రజాసమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఇప్పుడు వాటిని చూపించి చంద్రబాబు కేబినేట్‌లో క్రిమినల్స్ దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు ఉన్నారని ఆరోపించడం తగదని హితవు చెప్పారు.