
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు ఏసీబీ కార్యాలయంలో ఆయనను విచారించిన అధికారులు.. ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఆరా తీశారు. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. సందీప్ అనే వ్యక్తి ఎవరు? అతనితో ఉన్న లావాదేవీలు ఏంటి? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.
ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్‌లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది. కాగా, ఏసీబీ విచారణకు ఉమా మహేశ్వర రావు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం.
ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.
ఉమామహేశ్వరరావుకు జ్యూడీషియల్ రిమాండ్
ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment