విజయవాడ చిట్టినగర్‌కు చెందిన నొక్కొజు మల్లేశ్వరరావు కార్పెంటర్. అతనికి జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) పథకంలో ఇల్లు ఇప్పిస్తానని విజయవాడ 47వ డివిజన్ టీడీపీ నాయకుడు మాకిన విజయ్‌కుమార్ నమ్మబలికాడు. ఐదేళ్ల క్రితం మల్లేశ్వరరావు నుంచి రూ.1.60 లక్షలు వసూలు చేశాడు. ఇప్పటికీ ఇల్లు ఇప్పించలేదు. విజయ్‌కుమార్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
విజయవాడ చిట్టినగర్‌లో బండిపై పూసలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమ్మన మాధవికి ఇల్లు ఇప్పిస్తానని విజయ్‌కుమార్ రూ. 3.20 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన బాధితురాలు మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల పేరిట జరిగిన భారీ మోసంలో చిన్న ఉదాహరణలు. ఇలా మోసపోయిన వారు నగరంలో 2 వేల మంది ఉన్నట్లు అంచానా. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిద్యాదులతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 70 కోట్లు పేదల నుంచి వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో టీడీపీ నాయకులు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు.రోడ్లు, కాలువలు విస్తరణలో ఇళ్లు కొల్పోయిన పేదలకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో నివాసం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించాయి.
చదవండి: పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా: పేర్ని నాని
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం పనులు 2014 వరకు నిర్విరామంగా కొనసాగాయి. విజయవాడ నగరంలో ఇళు కోల్పోయిన పేదల కోసం నగరంలోని జక్కంపూడి, ఆర్‌ఆర్‌పేట, సింగ్‌నగర్, కబేలా ప్రాంతాల్లో వంద ఎకరాల్లో 28,152 జీ ఫ్లస్ త్రి గృహాల నిర్మాణం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే అప్పటివరకు నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించింది. దీంతో విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఈ ఇళ్లను యధేచ్ఛగా అమ్మేశారు.
ఆ నియోజకవర్గాలకు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నాయకులు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు కనుసన్నల్లోనే ఈ బాగోతం జరిగినట్లు తెలుస్తోంది. ఉచితంగా ఇవ్వాల్సిన ఈ ఇళ్లను డివిజన్లలో టీడీపీ నాయకులు ఒక్కొక్కరూ 200 గృహాలు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసి వారు రూ. కోట్లు దండుకున్నారు.
నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు
జక్కంపూడి, సింగ్‌నగర్, ఆర్‌ఆర్‌పేట, కబేలా ప్రాంతాల్లో జేఎన్‌ఎన్‌ఆర్‌యుఎం ఇళ్ల కేటాయింపు 2018లోనే పూర్తయింది. అయినా, టీడీపీ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు, మునిసిపల్, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇళ్లు లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేసి పేదల నుంచి వసూళ్లు చేశారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని 41 డివిజన్లలో ఈ తరహా బాధితులు 2 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరి నుంచి రూ. 60 నుంచి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. చాలా మంది బాధితులు ముందుగా కొత్తపేట (టుటౌన్) పోలీసులను ఆశ్రయిస్తున్నాయి.
అక్కడా విజయ్‌కుమార్ మాటే చెల్లుబాటు కావడంతో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు మాకిన విజయ్‌కుమార్ బాధితులు 35 మంది ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇతనితోపాటు 41వ డివిజన్‌లోని నాగోతు రామారావు, 57వ డివిజన్‌లోని ఎడిబోతు రమణ, 58వ డివిజన్‌లోని సోమేశ్వరరావు, రామారావు, 60వ డివిజన్‌లోని భువట ఉమా, శ్రీరాములు, 63వ డివిజన్‌లోని పైడి శ్రీను పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment