
హరితహారంలో విస్తారంగా పెంపకం
♦ వర్షాలు మొదలు కావడమే ఆలస్యం
♦ గత ఏడాది వర్షాభావం దెబ్బతీసింది
♦ ఈసారి లక్ష్యాన్ని సాధిస్తాం
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు
మెదక్: అడవుల శాతం పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని మెదక్ డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు. ఇందుకోసం హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ యేడు 3 కోట్ల మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతున్నట్టు చెప్పారు. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయామన్నారు. ఈసారి వాతావరణం అనుకూలించే అవకాశం ఉన్నందున కచ్చితంగా 3 కోట్ల మొక్కలను నాటుతాం. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో హరితహారంపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఇలా..
ప్రశ్న: జిల్లాలో ఎన్ని హెక్టార్లలో అడవులున్నాయి?
జవాబు: అధికారిక లెక్కల ప్రకారం 97,690 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి.
ప్ర: భూభాగంతో పోలిస్తే అడవుల శాతం ఎంత ఉండాలి?
జ:భూభాగంతో పోల్చుకుంటే 33 శాతం అడవులు ఉంటేనే విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
ప్ర: ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నదెంత?
జ: కేవలం 9.5శాతం మాత్రమే అడవులున్నాయి. అందులో ఓపెన్ జంగల్ 0.5 శాతం మాత్రమే ఉంది. అందులో పూర్తిగా అడవులు క్షీణించి ఉండగా కేవలం 9శాతం మాత్రమే జిల్లాలో అడవులు ఉన్నాయి. ఈ లెక్కన మరో 24 శాతం మేర అడవులు పెరగాల్సి ఉంది.
ప్ర:హరితహారంలో భాగంగా ఈ యేడు జిల్లా వ్యాప్తంగా ఎన్ని మొక్కలు నాటుతున్నారు?
జ:అటవీశాఖలోని టెరిటోరియల్‌తోపాటు సోషల్ ఫారెస్ట్, డ్వామా, ఈజీఎస్, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో 3 కోట్ల మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతున్నాం.
ప్ర: గతంలో ఎన్ని మొక్కలు నాటారు?
జ:గతంలో 3.52 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 1.50 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
ప్ర:అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎన్ని మొక్కలు నాటుతున్నారు?
జ:అటవీ శాఖలోని టెరిటోరియల్ విభాగంలో 38 లక్షల మొక్కలు నాటడం జరుగుతుంది.
ప్ర: ఏయే ప్రాంతాల్లో మొక్కలు నాటుతారు?
జ:అడవుల్లో గుంతలు తీసి, గుట్టలపై సైతం నాటేందుకు చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని రేగోడ్ మండలంలో గల గుట్టల ప్రాంతం మొక్కల పెంపకానికి అనువైనది గుర్తించాం.
ప్ర:ఎన్ని కిలో మీటర్ల మేర మొక్కలు
నాటుతారు?
జ:గత ఏడాది 500 కిలోమీటర్ల మేర మొక్కలు నాటేందుకు నిర్ణయించాం. వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 200 కిలో మీటర్ల మేర మాత్రమే నాటాం. మిగతా 300 కిలో మీటర్ల మేర ఈ యేడు నాటుతాం.
ప్ర: కిలోమీటర్‌కు ఎన్ని మొక్కలు నాటుతారు?
జ: కిలో మీటరుకు సుమారు 6 వేల నుంచి 6,500 వరకు మొక్కల నాటడం జరుగుతుంది.
ప్ర: అటవీ ప్రాంతంలో నీటి నిల్వల కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
జ: జిల్లాలోని అడవుల్లో 170 కందకాలు, 20 మినీ చెక్‌డ్యాంలు, 30 కుంటలు ఉన్నాయి. వాటిలో వర్షపు నీరు వచ్చి చేరుతుంది.
ప్ర: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఏయే మొక్కలు, ఎన్ని, ఎక్కడ నాటుతున్నారు?
జ: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఈ యేడు 39 లక్షల మొక్కలు నాటడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్లకు ఇరువైపులా నాటుతాం.
ప్ర: ఎక్సైజ్ అధికారులు ఏయే మొక్కలు నాటుతున్నారు?
జ: ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉపాధి హామీలో భాగంగా పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నారు.
ప్ర: అడవుల్లో ఏయే మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు?
జ:అడవుల్లో అన్ని రకాల మొక్కలు నాటుతాం. అడవులు ఎక్కువగా పెరిగేందుకు గచ్చకాయ, కానుగ వంటి మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
ప్ర: ఏ వయస్సు మొక్కలు నాటాలి?
జ: నర్సరీల్లోని 16 నెలల మొక్కలు నాటితే మంచి ఫలితం ఉంటుంది. చిన్న వయస్సు మొక్కలు నాటినా... పెద్ద వయస్సు మొక్కలు నాటినా అవి అంతగా పెరగవు.
ప్ర: జిల్లాలో 3 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయా?
జ: గత ఏడాది ఏర్పాటు చేసిన నర్సిరీల్లో సుమారు 1.5 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మిగతా మొక్కలను నర్సరీల్లో పెంచడం జరుగుతుంది.
ప్ర:ఎప్పుడు నాటుతారు?
జ: వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెడతాం.
ప్ర: గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నాటిన మొక్కల పరిస్థితి ఏమిటి?
జ: గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని మొక్కలు ఎండుముఖం పట్టగా, చాలా వరకు మొక్కలను నీరుపోసి రక్షించాం. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మక్త మాసాన్‌పల్లిలో గత ఏడాది నాటిన మొక్కలు చాలావరకు పెరిగాయి.