♦ స్థానికంగా ఎక్సైజ్ అధికారుల దాడులు
♦ గుడుంబా ముడి పదార్థాలు స్వాధీనం
♦ అరెస్టులను నిరసిస్తూ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన
♦ 9 మంది మహిళలను విడిచిపెట్టడంతో సద్దుమణిగిన వివాదం
హైదరాబాద్: ధూల్‌పేట్ ఎక్సైజ్ కార్యాలయాన్ని స్థానికులు ముట్టడించడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ధూల్‌పేట్ నలుమూలలా ఎక్సైజ్ విభాగం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో భారీ ఎత్తున గుడుంబా ముడి పదార్థాలు, 400 లీటర్ల ఐడీ లిక్కర్, 18,600 లీటర్ల వాష్, 195 కిలోల నల్లబెల్లం, 8 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గుడుంబా తయారీ, అమ్మకాలతో సంబంధంలేని మహిళలనూ పోలీసులు అరెస్టు చేశారని ఆరోపిస్తూ అప్పర్ ధూల్‌పేట్, లోయర్ ధూల్‌పేట్, జాలిహనుమాన్, టక్కర్‌వాడి, రహీంపురా, మాగ్రా, బంగ్లాదేశ్ ఏరియా తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఎక్సైజ్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోషామహల్ ఏసీపీ కొలన్‌పాక రాంభూపాల్‌రావు ఆధ్వర్యంలో మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ ఆర్. శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. గోషామహల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అడ్‌హాక్ కమిటీ సభ్యుడు నందకిషోర్‌వ్యాస్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి అధికారులతో చర్చించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి గుడుంబాకు సంబంధంలేని 9 మంది మహిళలను విడిపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ దాడుల్లో హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు భగవాన్‌రావుతో పాటు ఈఎస్‌లు, ఎఈఎస్‌లు, ధూల్‌పేట్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు సైదిరెడ్డి, కనకదుర్గ, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్య పరిష్కరిస్తాం: బిలాల్
ధూల్‌పేట్‌లో దీర్ఘకాలంగా ఉన్న గుడుంబా తయారీ, విక్రయాల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీఆర్‌ఎస్ నేత నందకిషోర్‌వ్యాస్(బిలాల్) వెల్లడించారు. మహిళలతో ఆందోళన విరమింపజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడుంబా తయారీ వృత్తిని వదులుకున్నవారికిప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ ముట్టడి
Published Mon, Dec 7 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement