టీడీపీలో నాలుగు స్తంభాలాట! | Differences in Sullurpet TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో నాలుగు స్తంభాలాట!

Published Wed, Aug 3 2016 2:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

సూళ్లూరుపేట: మొదటి నుంచి వేనాటి రామచంద్రారెడ్డి, కొండేపాటి గంగాప్రసాద్‌ వర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి మరో గ్రూపుగా మారారు.

 
  •  నేతల మధ్య ముదిరిన విబేధాలు 
  •  నామినేటెడ్‌ పదవుల కోసం పోటాపోటీ 
 
మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే చందంగా తయారైంది టీడీపీలో పరిస్థితి. పదవుల సంఖ్య పరిమితంగా ఉండటం వాటిని ఆశించే నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వర్గవిబేధాలు ముదిరిపాకాన పడుతున్నాయి. నామినేటెడ్‌ పదవుల నేతల మధ్య పోటీ తీవ్రమైంది. నాలుగు వర్గాలుగా విడిపోయి పదవులు, పనుల కోసం లోలోన పోట్లాడుకుంటున్నారు. 
సూళ్లూరుపేట:
మొదటి నుంచి వేనాటి రామచంద్రారెడ్డి, కొండేపాటి గంగాప్రసాద్‌ వర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి మరో గ్రూపుగా మారారు. వీరితో పాటు మొదటి నుంచి పరసా వెంకటరత్నయ్య వర్గం ఎలాగూ ఉంది. రెండో విడత నీరు–చెట్టు పనుల పంపకాల్లో తలెత్తిన వివాదం ప్రస్తుతం ఆలయ పాలక మండళ్ల నియామకంలో ఎక్కువైంది. కొండేపాటి తన వర్గీయులకు పనులు కేటాయించాలని ప్రతిపాదించారు. అయితే వేనాటి వర్గీయులు 40 శాతం, వాకాటి వర్గీయులు 40 శాతం, పరసా వర్గీయులు 20 శాతం పనులను పంచుకున్నారు. ఈ విషయంలో కొండేపాటి అసంతృప్తికి గురయ్యారు. 
నామినేటెడ్‌ పదవుల భర్తీ నేపథ్యంలో వివాదం:
నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో ఈ విబేధాలు తారాస్థాయికి చేరాయి.     మొదటి నుంచి వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవిని వేనాటి పరంధామిరెడ్డి ఆశిస్తున్నారు. తాజాగా కొండేపాటి వర్గీయులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి పేరును వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీకి, ఆకుతోట రమేష్‌ పేరును నాగేశ్వరస్వామి దేవస్థానానికి చైర్మన్లుగా సీఎం నుంచి ఆర్డర్‌ వేయించుకున్నారని తెలిసింది. దీంతో వేనాటి, వాకాటి, ఇసనాక, పరసా కలిసి ముఖ్యమంత్రి వద్దనే పంచాయతీ పెట్టినట్టుగా సమాచారం. వేనాటి వర్గీయులకు ఆ పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొండేపాటి తన బావమరిదికి పెంచలకోన నరసింహస్వామి ఆలయం, వియ్యంకుడికి శ్రీ కాళహస్తి శివాలయం ౖచైర్మన్, నాయుడుపేట మార్కెట్‌ కమిటీకి శిరసనంబేటి విజయభాస్కర్‌రెడ్డికి తెచ్చుకున్నారు కదా! మళ్లీ వీటిల్లో కూడా ఆయన పెత్తనమేనా! అని వేనాటి, వాకాటి వర్గీయుల ప్రశ్నిస్తున్నారు. 
వర్గ విభేదాలు బహిర్గతం:
గురువారం నెల్లూరులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పరసా పనితీరుపై నాయుడుపేట, సూళ్లూరుపేట నాయకులు ధ్వజమెత్తారు. గురువారం జరిగిన మున్సిపల్‌ సమావేశంలో విభేదాలు స్పష్టంగా కనిపించాయి. 
ప్రస్తుతం చైర్‌పర్సన్‌ వేనాటి వర్గాన్ని విస్మరించి కొండేపాటి వర్గంగా మారిపోవడంతో ఈ విభేదాల సెగ మున్సిపాలిటీకి తాకింది. దీంతో గురువారం జరిగిన మున్సిపల్‌ సాధారణ సమావేశంలో వేనాటి కుమారుడు సుమంత్‌రెడ్డి చైర్‌పర్సన్‌పై పరోక్షంగా విమర్శించి సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేయడంతో పాలకపక్షంలోని వేనాటి వర్గానికి చెందిన కౌన్సిలర్లు అందరూ బయటకు వచ్చేశారు. కొండేపాటి వర్గీయులు మాత్రమే సమావేశంలో ఉన్నారు.  టీడీపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి మధ్య అధిపత్య పోరు జరుగుతుండడం కొసమెరుపు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement