
గజ్వేల్‌లో సిబ్బందిని పరిచయం చేసుకుంటున్న డీఐజీ
- గౌరారం ఎస్‌ఐ సస్పెన్షన్
- జగదేవ్‌పూర్ ఎస్‌ఐకి సూచనలు
గజ్వేల్ రూరల్: నిజామాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ గురువారం గజ్వేల్ సర్కిల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ములుగు, గౌరారం, జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్లను సందర్శించిన అనంతరం గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అ క్కడ పోలీస్ సిబ్బంది డీఐజీకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ అకున్ సబర్వాల్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ములుగు పోలీస్‌స్టేన్ పనితీరు పరవాలేదని, గౌరారం పోలీస్‌స్టేన్‌లో పనులు సరిగ్గా జరగనందున ఎస్‌ఐని సస్పెండ్ చేశామని, సాయంత్రంలోగా ఆర్డర్ పంపించనున్నట్లు తెలిపారు. అలాగే జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి కొన్ని సూచనలు చేశామన్నారు. మళ్ళీ శనివారం వచ్చి పలు సూచనలు చేస్తానన్నారు.
కాగా గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో విధుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించిన పోలీసు సిబ్బంది రాములు, స్వామిలకు రూ. 500 చొప్పున రివార్డును అందించనున్నట్లు తెలిపారు. అనంతరం గజ్వేల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉసిరి మొక్కను నాటారు. ఈ డీఐజీ అకున్ సబర్వాల్‌తో పాటు గజ్వేల్ సీఐ సతీష్ పోలీసు సిబ్బంది ఉన్నారు.
జగదేవ్‌పూర్ ఠాణాను తనిఖీ చేసిన డీఐజీ
జగదేవ్‌పూర్: డీఐజీ అకున్ సబర్వాల్ గురువారం ఉదయం జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. పీఎస్ రికార్డులను పరిశీలించారు. అరగంట పాటు ఎస్‌ఐ వీరన్నతో కలిసి పోలీస్ భవనాలను పరిశీలించారు. ఆవరణలో పచ్చదనం పరుచుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా వేప మొక్కను నాటారు. కార్యక్రమంలో గజ్వేల్ సీఐ సతీష్, కానిస్టేబుల్ బాలమల్లయ్య, శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు.