రాయలసీమపై వివక్ష
రాయలసీమపై వివక్ష
Published Mon, Jun 5 2017 11:52 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
- సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోని ప్రభుత్వం
- కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ధ్వజం
–విజయవంతమైన ఎమ్మిగనూరు ప్లీనరీ
ఎమ్మిగనూరు : రాయలసీమ జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక ఆరోపించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీ మాట్లాడుతూ.. పట్టి సీమ ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో 10 శాతం నిధులు కేటాయించి ఉంటే కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. ప్రజల కోసం పాలన కాకుండా పార్టీ కోసం ప్రభుత్వం అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎమ్మెల్యేలకు కేటాయించాల్సిన నిధులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కేటాయించడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఎమ్మిగనూరులో అప్పీరియల్ పార్క్ నిర్మాణానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేకపోతున్నారన్నారు. ఎంపీగా తాను వికలాంగులకు రూ. 2.50 కోట్లతో పరికరాలను అందించగలిగానని.. మూడు రోడ్లను జాతీయ రహదారులుగా మార్చానని, కర్నూలు – మంత్రాలయం రైల్వేలైన్ సర్వేకు నిధులు వచ్చేలా చేశానని చెప్పారు.
నిర్మాణాల పేరుతో అవినీతి
సాగునీటి ప్రాజెక్టులను అదనపు అంచనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం అయిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కేవలం అమరావతి జపం చేస్తూ రాయలసీమ ప్రజలను విస్మరించిందన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గంలో కూడా తాగునీటి సమస్య కోసం ఎంపీ ఎక్కువ నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని మాజీ ఎమ్మెల్యే, ప్లీనరీ పరిశీలకులు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. మూడేళ్ళలో అధికార తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు.
కర్నూలు జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే హంద్రీనీవా నీటిని చిత్తూరు జిల్లాకు తరలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా కాలువ నుంచి జిల్లాలోని 150 చెరువులకు నీటిని నింపే ప్రతిపాదనలను జిల్లా అధికారులు పంపితే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారన్నారు. కనీసం జిల్లాలోని ఒక్క అధికార పార్టీ నాయకుడు కూడా దీనిని ప్రశ్నించలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వై. రుద్రగౌడ్, జె. సంపత్‌కుమార్‌గౌడ్, బసిరెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, బుట్టా రంగయ్య, నసురుద్దీన్, కాశిరెడ్డి, జెడ్‌పీటీసీ జయమ్మ, వివిధ మండలాల, గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
టీడీపీ..అవినీతి పార్టీ
భూదందాలు, కబ్జాలతో టీడీపీ అవినీతిమయంగా మారిపోయిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. నిరుద్యోగులను, డ్వాక్రా గ్రూపు మహిళలను, రైతులను మోసం చేశారన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునేవారు లేరన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే వచ్చే 2019 లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.
Advertisement