ఆచారి శిబిరాన్ని సందర్శించిన కిషన్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి
కల్వకుర్తి: కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేసే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు సీఎస్ రాజీవ్‌శర్మ దష్టికి తీసుకెళ్తానని బీజేపీ శాసనసభ పక్షనేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తి డివిజన్ కోసం వారం రోజులుగా ఆమరణదీక్ష చేపడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి టి.ఆచారికి మంగళవారం పూలమాలలు వేసి ఆయన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏడురోజులుగా ఆమరణదీక్ష చేయడం కష్టసాధ్యమని, ఆచారి పోరాట పటిమను అభినందించారు. రెవెన్యూ డివిజన్ చేసేందుకు అన్ని హంగులు ఉన్నాయని, ఏర్పాటుచేయకపోవడం రాజకీయ స్వలాభమే అన్నారు. గిరిజనులు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండడంతో పాటు పూర్తిగా వెనుకబడిన ప్రాంతమన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి రాజకీయకోణం, స్వలాభాన్ని ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ విషయంపై కేంద్రమంత్రులతో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, కొండన్న, జిల్లా అధ్యక్షుడు రతంగ పాండురెడ్డి, ఆనంద్‌కుమార్, ఎడ్మ సత్యం, శేఖర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.