ఎమ్మెల్యేలు ప్రభాకర్ Vs ప్రభాకర్
అనంతపురం: అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అనుచరులు.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై దాడి చేయనున్నట్టు వదంతులు రావడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే అనుచరులు ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. తన ఇంటి వద్ద బందోబస్తుగా ఉన్న పోలీసులు వెనక్కి వెళ్లిపోవాలని ప్రభాకర్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఎవరికీ తాను భయపడేది లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా దౌర్జన్యాలను ఎదుర్కొంటామని చెప్పారు.
అనంతపురం నగరంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరి మధ్య మాటలయుద్దం మొదలైంది. జేసీ ఇటీవల మాట్లాడుతూ.. గాంధీ విగ్రహం ఏర్పాటుకు నెలరోజులు గడువు ఇస్తున్నామని, ఈలోపు ప్రభాకర్ చౌదరి ప్రారంభించకుంటే తామే ఆ పని చేస్తామని సవాల్ విసిరారు. అయితే గాంధీ విగ్రహం సిద్ధమైంది కానీ... ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యతో ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభాకర్ చౌదరికి పబ్లిసిటి పిచ్చి పట్టిందని జేసీ ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం అనంతపురంలో మాట్లాడుతూ... తన నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటానని ప్రభాకర్ చౌదరి హాడావుడి చేస్తున్నాడు... కనీసం 2 వేల మొక్కలు కూడా నాటలేదిని ఆరోపించారు. ఓ వేళ లక్ష మొక్కలు నాటినట్లు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ విసిరారు.