ఇంటికొచ్చి కొడతా..
♦ టీడీపీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య ముదిరిన విభేదాలు
♦ ఇంటికొచ్చి కొడతానని చౌదరిని హెచ్చరించిన జేసీపీఆర్
♦ తనపై చేయి వేయాలంటే మరో జన్మ ఎత్తాలంటున్న చౌదరి
♦ ‘అనంత’లో ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్న ఇరువర్గాలు
అధికార పార్టీ నేతల మధ్య వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. ఉప్పు నిప్పులా ఉన్న తాడిపత్రి, అనంతపురం ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్ చౌదరి మరోసారి మాటల యుద్ధానికి దిగారు. ‘నువ్వెంతంటే.. నువ్వెంత’ అనేలా పరస్పరం దూషించుకున్నారు. అనంతపురంలోని పాతూరు రోడ్డు విస్తరణ పనుల్లో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. బాధ్యత గల ప్రజాప్రతినిధులమని మరిచి నోరుజారుతున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి విభేదాలతో టీడీపీలో క్రమశిక్షణ ఎలా ఉందో మరోసారి స్పష్టమవుతోంది.
(సాక్షిప్రతినిధి, అనంతపురం): ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్‌చౌదరి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రషీద్‌ను పార్టీలోకి చేర్చుకోవాలని చౌదరి లలితకళాపరిషత్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగి రషీద్ చేరికను అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఇద్దరి మధ్య విభేదాలకు బీజం పడింది. తర్వాత పాతూరు రోడ్డు విస్తరణ పనుల్లో ఇద్దరూ రోడ్డెక్కారు. రోడ్డును విస్తరించాలని జేసీ బ్రదర్స్, విస్తరణ చేపడితే ప్రార్థన మందిరాలు తొలగించాల్సి వస్తుందని, ఇది కొందరి మనోభావాలను దెబ్బతీస్తుందని చౌదరి పర స్పరం ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలోనే జేసీ బ్రదర్స్ ‘అనంత’లో బలప్రదర్శనకు దిగారు. తాడిపత్రి నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను పాతూరుకు రప్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌చౌదరిపై ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి తనదైన శైలిలో దూషణలకు దిగారు. ఇరువర్గాలు కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం రోడ్డు విస్తరణ అంశాన్ని వాడుకుంటున్నాయని, విస్తరణపై ఇద్దరికీ చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎవరు అడ్డొచ్చినా విస్తరణ చేసి తీరతామని ప్రకటించిన జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నాయి.
ఎన్‌టీఆర్ మార్గ్ ప్రారంభోత్సవంలోనూ ఇదే తీరు
బస్టాండ్ సమీపంలోని శాంతి నర్సింగ్ హోం నుంచి చెరువుకట్ట వరకూ 80 అడుగుల రోడ్డును గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు మంజూరు చేయించారు. 50 శాతం పనులు కూడా పూర్తి చేశారు. తక్కిన పనులు పూర్తికాకుండా, భూసేకరణ కొలిక్కి రాకుండానే మేయర్ స్వరూప, చౌదరి ‘ఎన్‌టీఆర్ మార్గ్’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీని ఆహ్వానించలేదు. 80 అడుగుల రోడ్డు పూర్తయ్యేందుకు అవసరమైన నిధులు తానే తెప్పించానని చెప్పకునే జేసీ ఈ ఘటనపై కూడా తీవ్రంగా స్పందించారు.
ఇలా ‘అనంత’లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్నీ ఇరువర్గాలు రాజకీయ ఆధిపత్యం కోసం వాడుకుంటున్నాయి. చివరకు టవర్‌క్లాక్ వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహం విషయంలోనూ రాజకీయ చిచ్చును రగిల్చాయి. విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని, అయినా నెలరోజుల్లో ఏర్పాటు చేసి తీరతామని జేసీపీఆర్ ప్రకటించారు. అయితే ఇంత వరకూ అతీగతీ లేదు. ఆర్యవైశ్యులకు సంబంధించిన కొత్తూరు అమ్మవారిశాల కల్యాణమండపాన్ని మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. ఈ ఘటనకు మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కారణమని నగరంలో తీవ్ర చర్చ సాగింది.
దీనికి వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు చేసిన ర్యాలీ, కార్పొరేషన్ కార్యాలయ ముట్టడిలో జేసీ అనుచరుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ఘటనలో గాయపడిన కోగటంను పరామర్శించేందుకు వచ్చిన జేసీపీఆర్.. ‘నేను అనుకుంటే వాడి ఇంటికాడికి సక్కగా వచ్చి కొడతా’ అని ఎమ్మెల్యే చౌదరిని ఉద్దేశించి అన్నారు. దీనిపై చౌదరి కూడా అదే స్థాయిలో స్పందించారు. ‘నన్ను కొట్టాలంటే మరో జన్మ ఎత్తాల’ని అన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగడం సరికాదని, వీరి మధ్య విభేదాలతో ‘అనంత’ అభివృద్ధికి విఘాతం కలుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని ఆ పార్టీ నాయకులతో పాటు సీఎం చంద్రబాబు పదేపదే వ్యాఖ్యానిస్తుంటారని, ఎలాంటి క్రమశిక్షణ ఉందో జేపీఆర్, చౌదరిని చూస్తే స్పష్టమవుతోందని విమర్శిస్తున్నారు.