మంచిర్యాల రూరల్ : నేడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించకుండా స్వయం ఉపాధితో కూడా ముందుకు సాగి అభివృద్ధి పథంలో నడవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. గురువారం మంచిర్యాల ఈజీఎస్ ఏపీడీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ కోర్సులో ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పించి నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కలిపించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనలో ముందుందన్నారు. మంచిర్యాల ఈజీఎస్ ఏపీడీ మల్లేశ్ మాట్లాడుతూ, జాబ్‌కార్డు ఉన్న కుటుంబాల్లో వంద రోజులు పని చేసిన ఆయా కుటుంబాల్లోని యువతకు డ్రైవింగ్ కోర్సు ద్వారా 35 మంది శిక్షణ పొందారని, త్వరలోనే మరో 45 మందికి డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 1228 మంది యువత ఉండగా ఇందులో 30 మంది ఫ్యాషన్ డిజైన్, 45 కంప్యూటర్ కోర్సు, 20 మంది వైండింగ్, 25 మంది హౌజ్ వైరింగ్, 30 మంది టైలరింగ్‌లో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఎంపీపీ బేర సత్యనారాయణ, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, మున్సిపల్ కౌన్సిలర్ దెబ్బటి శ్రీనివాస్, ఏపీఓ నవీణ్, డ్రైవింగ్ శిక్షణ కోర్సు డైరైక్టర్ సత్యనారాయణ, ఎస్‌బీహెచ్ ఆర్‌ఎస్‌ఈటీఐ డిప్యూటీ డైరైక్టర్ ఆశన్న, స్థానికులు, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.