గాడితప్పిన విద్యాశాఖ
కడప ఎడ్యుకేషన్:
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలు పేరుకుపోయాయి. స్కూళ్లు తెరిచి రెండు నెలలు అవుతున్నా నేటికీ ఒక్క విద్యార్థికి కూడా యూనిఫాం అందలేదు. పాఠ్యపుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో అందక విద్యార్థులు సతమతమవుతున్నారు. కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఇంగ్లిషు మీడియం పుస్తకాలు అందలేదు. ఈ ఏడాది మార్చి నుంచి నేటి వరకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు రాక వంట నిర్వాహకులు అప్పుల పాలయ్యారు.
వంట గదులు లేక ఇక్కట్లు:
జిల్లా వ్యాప్తంగా 1600 పాఠశాలల్లో వంట గదులు లేక ఆరుబయటే వంటలను చేస్తున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. పలు పాఠశాలల్లో సరిపడ తరగతి గదులు లేక వరండాలు, చెట్ల కింద కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతి లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 217 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేశారు. కానీ నేటికి వాటికి సరైన మౌలిక వసతులను కల్పించడంలో విఫలమయ్యారు.
ఉపాధ్యాయులకు పర్మినెంట్ స్థానాలు కరువు:
2015 అక్టోబర్‌లో జరిగిన పాఠశాలల రేషనలైజేషన్‌లో విద్యార్థులు లేక 277 పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో 105 మంది ఉపాధ్యాయులు మిగిలిపోయారు. దీంతోపాటు 2014 డీఎస్సీలో నూతనంగా 125 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అలాగే అంతర్ జిల్లాల బదిలీల్లో భాగంగా 36 మంది ఉపాధ్యాయులు జిల్లాకు వచ్చారు. వీరిలో రెషనలైజేషన్‌లో మిగిలిపోయిన 105 మందిలో 26 మందికి మాత్రమే పర్మినెంట్ స్థానాలను కేటాయించారు. మిగతా వారందరిని మూతబడిన పాఠశాలల్లో ఉన్నట్లే చూపిస్తూ మరో పాఠశాలలో పని చేపిస్తూ జీతాలను ఇస్తున్నారు. అలాగే నూతన డీఎస్సీలో వచ్చిన 125 మందికి గాను కేవలం 14 మందికి మాత్రమే పర్మినెంట్ స్థానాలను కల్పించారు. మిగతా వారందరికి పని ఒక చోట చేస్తే జీతం మరో చోట ఇస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుల పరిస్థితి ఇంతే.
రెగ్యులర్ ఎంఈఓల కొరత:
జిల్లాలో 51 మండలాలకు గాను కేవలం 8 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా వారంతా హెచ్‌ఎంలే ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ఇలా పలు సమస్యలు విద్యా శాఖలో తాండవిస్తున్నాయి. కడప జిల్లా పర్యటనకు వస్తున్న విద్యా కమిషనర్ సంధ్యారాణి చొరవ తీసుకుని పరిష్కరించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.