జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మను బదిలీ చేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతపురం లీగల్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మను బదిలీ చేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన్ను గుంటూరు జిల్లా న్యాయమూర్తిగా నియమించింది. ఈయన స్థానంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సుబ్రమణ్యకుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సుబ్రమణ్యకుమార్ కుటుంబ న్యాయస్థానం జడ్జిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన హరిహరనాథ శర్మ పరిపాలనా పరంగా కొన్ని విప్లవాత్మక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈయన న్యాయవాదులకు జూనియర్ సివిల్ జడ్జి రాత పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఇవ్వడం, కోర్టు ఆవరణలో స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు చేపట్టి తనదైన శైలిని చూపారు.