సెజ్ భూములుండగా.. పేదలవే కావాలా?
Published Thu, Nov 3 2016 9:39 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
తుని :
కాకినాడ సెజ్ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూములు ఉండగా దివీస్ మందుల పరిశ్రమ కోసం పేద రైతుల భూములను తీసుకుని వారి కడుపు కొట్టడం దారుణమని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. దివీస్ భూసేకరణకు వ్యతిరేకంగా తొండంగి మండలంలోని తీర ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభను పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడి తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మట్టా లక్షి్మని ఎమ్మెల్యే రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివీస్ పరిశ్రమకు సెజ్ భూముల్లో 500 ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఇందుకు భిన్నంగా కారు చౌకగా పేదల భూములను ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. సెజ్ భూములైతే ఎకరాకు రూ.75 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే పేదల భూములను రూ. 5 లక్షలకు అప్పనంగా కొట్టేయవచ్చనే ఉద్దేశంతో పోలీసులను అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న ఆన్యాయాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యేనైన తనను తీవ్రవాదిగా సీఎం చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని రాజా మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ప్రజల తరఫున నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించక పోవడం వారి అజ్ఞానికి నిదర్శనమన్నారు. పేద రైతుల కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప కార్పొరేట్ కంపెనీల కోసం కాదన్నారు.
Advertisement