మేడిగడ్డ వద్దే మళ్లింపు!
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం
♦ 100 మీటర్ల ఎత్తు, 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ
♦ తుమ్మిడిహెట్టి బ్యారేజీ 148 మీటర్ల ఎత్తుకే పరిమితం
♦ కాలువలను పక్కనపెట్టి నదీ మార్గం వినియోగంపై దృష్టి
♦ మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య అదనంగా మరో రెండు బ్యారేజీలు
♦ డిసెంబర్‌లో పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచే నీటిని మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఇక్కడ సుమారు 120 రోజులకుపైగా నీటి లభ్యత ఉండడం, నిర్ణీత 160 టీఎంసీల నీటిని మళ్లించుకునేందుకు అనువైన ప్రాంతం కావడంతో మేడిగడ్డ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ముంపునకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ బ్యారేజీని 100 మీటర్ల ఎత్తు, 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలనే కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఎత్తులోనూ ప్రాజెక్టుకు అవసరమయ్యే నీటిని పుష్కలంగా మళ్లించుకోవచ్చని వ్యాప్కోస్ సంస్థ తేల్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు కాలువల అలైన్‌మెంట్‌లో ఇప్పటికే గుర్తించిన 22 క్లిష్టమైన ప్రాంతాల దృష్ట్యా రెండు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది. కాలువల వ్యవస్థను పక్కనపెట్టి నది ప్రాంతంలోనే మరో రెండు బ్యారేజీలను అదనంగా చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీని 148 మీటర్లకు పరిమితం చేయాలని నిర్ణయించింది.
ప్రత్యామ్నాయాలపై దృష్టి..
తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం దిగువన నీటి ప్రవాహం ఎక్కువ రోజులు ఉంటుందని, నీటి లభ్యత సైతం గణనీయం గా ఉందని ఇప్పటికే వ్యా ప్కోస్ ప్రాథమికంగా నిర్ధారిం చింది. అంతరాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేకుండా ఇక్కడి నుంచి నీటిని మళ్లించుకుం టే.. ప్రాజెక్టు సాగు, తాగు నీటి లక్ష్యాలను చేరుకోవచ్చని నివేదించింది. మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య రామగుండం, ఎన్టీపీసీ వంటివి ఉండడంతో టన్నెల్, కాలువల తవ్వ కం కష్టతరమైన దృష్ట్యా కాలువల నిర్మాణాన్ని పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
కొత్తగా మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి 10 కిలోమీటర్లు దాటాక 120 ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద గోదావరి ప్రవాహ ప్రాంతంలోనే ఒక బ్యారేజీని, కొద్ది దూరంలో 130 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో మరో బ్యారేజీని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రెండు బ్యారేజీలకు 10 నుంచి 20 మీటర్ల మేర లిఫ్టును ప్రతిపాదించారు. ఈ రెండు బ్యారేజీల నుంచి నీటిని ఎల్లంపల్లికి తరలిస్తారు. అక్కడి నుంచి పాత డిజైన్ మేరకు మిడ్‌మానేరు, వివిధ రిజర్వాయర్ల ద్వా రా నీటిని తరలిస్తారు. ఈ అదనపు బ్యారేజీలతో పాటు, మేడిగడ్డ బ్యారేజీ పనులను డిసెంబర్‌లో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
తుపాకులగూడెం వద్ద మరో బ్యారేజీ
దేవాదులకు నీటిని అందించేందుకు వీలుగా తుపాకుల గూడెం (కొత్తూరు ప్రాంత ం) వద్ద కూడా మరో బ్యారేజీని నిర్మించాలని ఆదివారం నాటి సమావేశంలో నిర్ణయించారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను కలుపుతూ వీటికోసం ఇప్పటివరకూ చేసిన పనులను ఉపయోగించుకుంటూ ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగు పరచాలని భావిస్తున్నారు. దుమ్ముగూడెం దిగువన రిజర్వాయర్ నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని ఈ జిల్లాకు అందించాలని నిర్ణయించారు.