-
ఏ శాఖలో చూసినా ఉద్యోగులు బిజీబిజీ
-
జిల్లాల వారీగా ఊపందుకున్న ఫైళ్ల విభజన
ఇందూరు:
ప్రభుత్వ శాఖలకు ‘విభజన’ ఫీవర్ పట్టుకుంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఫైళ్లు, రికార్డులను వేరు చేసే పనుల్లో ఉద్యోగులు బిజీబిజీగా మారారు. నాలుగైదు రోజులుగా అన్ని శాఖల్లో సెక్షన్ల వారీగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారీగా ఫైళ్లను వేరు చేస్తున్నారు. గడువు దగ్గర పడుతుండడంతో ఇతర పనులకు ఫుల్‌స్టాప్ పెట్టి కేవలం ‘విభజన’ పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఏదైనా పని కోసం వచ్చిన వారిని వారం రోజుల తరువాత కలువండి అని చెప్పి పంపించేస్తున్నారు.
ఫైళ్ల విభజన, వాటి స్కానింగ్‌కు ఈ నెల 7 వరకు మాత్రమే గడువు ఉండడంతో ఆయా శాఖల ఉద్యోగులు విభజన ఫైళ్లను వేరే చేసే పనిలో స్పీడు పెంచారు. బీరువాలు, రికార్డుల గదుల్లో ఉన్న ఫైళ్లకు పట్టిన దుమ్ము దులుపుతున్నారు. వందల సంవత్సరాలకు చెందిన ఫైళ్లు సైతం తీయాల్సి రావడంతో ఉద్యోగులకు పని భారం, తీవ్రమైన ఒత్తిడి తప్పడం లేదు. కామన్ ఫైళ్లు మాత్రం జాగ్రత్త పరిచి వాటిని స్కానింగ్‌తో పాటు జిరాక్స్‌లు చేసి ఒరిజినల్ నిజామాబాద్ జిల్లాలో, జిరాక్స్ కాపీలు కామారెడ్డి జిల్లాకు పంపడానికి సిద్ధం చేస్తున్నారు. స్కానింగ్ చేసే సమయంలో శాఖ పేరు, ఫైలు నంబరు, దేనికి సంబంధించిందో రిఫరెన్స్‌ను ప్రత్యేకంగా రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. ఫైళ్లు, రికార్డులు అందజేసిన సమయంలో సంబంధిత అధికారితో ముట్టినట్లుగా సంతకం ఉన్న రసీదును తీసుకుంటున్నారు.
అయితే కలెక్టరేట్ పరిపాలన విభాగంలో స్కానింగ్ సెంటర్ ఉండగా, కలెక్టరేట్‌లోని మిగతా శాఖలకు చెందిన ఫైళ్లను స్కానింగ్ చేయించడానికి అక్షర ప్రణాళిక భవన్ వద్ద గల రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో రెండు కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేయించారు. ఇవి కూడా సరిపోకపోవడంతో ఆయా శాఖల ఉద్యోగులు ఫైళ్లను స్కానింగ్ చేయించడానికి క్యూ కడుతున్నారు. ఇటు కలెక్టరేట్ పరిపాలన విభాగంలో అత్యధికంగా ఫైళ్లు ఉండడంతో సెక్షన్ల వారీగా ఫైళ్లను వేరు చేసే పనిని వేగవంతం చేశారు. ఎక్కడ చూసినా నేలపైన, టేబుళ్లపైన పెట్టిన ఫైళ్లే దర్శనమిస్తున్నాయి. డీఆర్వో పద్మాకర్, ఏగో గంగాధర్‌లతో పాటు సెక్షన్ల సూపరింటెండెంట్లు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియనే కాకుండా ఫైళ్ల విభజన, స్కానింగ్ అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరినీ పలుకరించినా విభజన అంశమే వారి నోటి నుంచి వస్తోంది. బిజీగా ఉన్నాం.. మళ్లీ కలుస్తామని వెళ్లిపోతున్నారు.
సిబ్బంది కొరత ఉన్నా...
పలు శాఖల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు అటెండర్లు కూడా విభజన పనిలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఐకేపీ, డీఆర్‌డీఏ, డ్వామా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ శాఖలతో పాటు కార్పొరేషన్లు, ఇరిగేషన్, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ, ఐసీడీఎస్, విద్య, వైద్య, వ్యవసాయ, దీని అనుబంధ తదితర శాఖల్లో ఉన్న సిబ్బంది మొత్తం ఫైళ్లను వేరే చేసే పనిలోనే ఉన్నారు. కలెక్టర్ ఇచ్చిన సమయం దగ్గర పడుతుండడంతో తిండి తిప్పలు మాని విభజన ప్రక్రియలో పడ్డారు. ఉద్యోగులకు సెలవులు కూడా లభించట్లేదు. అయితే ఫైళ్లన్నింటినీ తీస్తున్న తరుణంలో గతంలో దొరకని కొన్ని పాత ఫైళ్లు కూడా వెలుగు చూస్తున్నాయి.
ఖాళీల జాబితా సిద్ధం..
జిల్లా పునర్విభజన నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల, శాఖల్లో పని చేసే ఇతర స్థాయి ఉద్యోగుల ఖాళీల వివరాలను అందజేయాలని ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే శాఖల వారీగా ఖాళీల పోస్టుల వివరాలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ జిల్లాలోనే చాలా శాఖలకు జిల్లా స్థాయి అధికారులు లేరు. ప్రధానంగా వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉండడంతో ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనుంది. కామారెడ్డి జిల్లాకు నిజామాబాద్ జిల్లా నుంచి ఎంత మంది ఉద్యోగులను పంపించాలి, శాఖల విలీనం అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.