గద్వాల జిల్లా కోసం హైవే దిగ్బంధం
- రాజకీయ కోణంలోనే గద్వాలను జిల్లా కాకుండా అడ్డుకుంటున్నారు: డీకే అరుణ
- ప్రజాభిప్రాయానికి సర్కార్ విలువ ఇవ్వడం లేదు: ఎమ్మెల్యే సంపత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బెంగళూర్- హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్‌లు నాయకత్వం వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఉదయం 10.30 గంటకు ప్రారంభమైన రాస్తారోకో మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది.
జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ స్తంభించడంతో డీకే అరుణ, సంపత్‌కుమార్, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య పెనుగులాట జరిగింది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సంపత్‌కుమార్‌ను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా చేయికి దెబ్బ తగిలింది. అతి కష్టం మీద ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలను పోలీసులు ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.
రాజకీయ కోణంలో అడ్డుకుంటున్నారు: డీకే అరుణ
రాజకీయ కోణంలో గద్వాలను జిల్లా కాకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కివేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల తరఫున పోరాడుతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు బాసటగా నిలిచి కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాంను సైతం ఇప్పుడు శత్రువుగా చూస్తూ దూరం పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో శక్తి పీఠమైన జోగుళాంబ పేరుతో గద్వాల జిల్లా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ విషయమై ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం వాటిని ఆధారంగా చేసుకుని జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గద్వాల జిల్లాను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం విలువనివ్వడం లేదని లక్షలాది మంది ప్రజలు గద్వాల జిల్లాను కోరుకుంటున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ధ్వజమెత్తారు. గద్వాల జిల్లా వల్ల అలంపూర్ నియోజకవర్గానికి పాలన సౌలభ్యం కలుగుతుందని ఆయన చెప్పారు.