జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని
గన్‌మెన్లను వెనక్కి పంపుతున్నా: ఎమ్మెల్యే సంపత్
గద్వాల అర్బన్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ‘‘నా జాతికి లేని పోలీసు రక్షణ నాకెందుకు?.. అందుకే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా ప్రభుత్వ గన్‌మెన్లను వెనక్కి పంపు తున్నాను’’అని ఆయన ప్రకటించారు.
గద్వాలలో జరిగిన అంబేడ్కర్ 126వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణతో కలసి ఆయన పాల్గొన్నారు. సంపత్ మాట్లాడుతూ ఒక దళిత మహిళ శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే బట్టలు ఊడదీసి కొడతానని ఎస్‌ఐ అసభ్య పదజాలంతో దూషిం చాడని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల దళితులపై దాడులు జరిగిన విషయాన్ని ఎస్పీ, డీఎస్పీ, సీఐల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.