అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
-
నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు రూరల్ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక బుజబుజనెల్లూరు వద్ద జాతీయ రహదారిపై అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలని శనివారం రాస్తారోకో చేశారు. నగర ఎమ్మెల్యే రాస్తారోకోలో పాల్గొని వారికి మద్దతిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల కోసం ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్ల రూపంలో సేకరించి తిరిగి చెల్లించకపోవడం బాధాకరమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయాలని అనేక రకాలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. అనేక మంది బాధితులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను అమ్మేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు సీపీఎం రూరల్ నియోజకవర్గ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి, రామరాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు.