అవకాశం వదలొద్దు
కడప స్పోర్ట్స్:
కడప నగరంలోని ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు నగరానికి తరలివచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్, ఎయిర్‌ఫోర్స్ (సెక్యూరిటీ) విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. రాతపరీక్ష, అడాప్టబిలిటీ టెస్టు, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించి అప్పటికప్పుడే ఫలితాలను కూడా వెంటనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంపికలకు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, యానాం జిల్లాల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఈ ఎంపిక ప్రక్రియ కడప నగరంలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియం, డీఎస్‌ఏ అవుట్‌డోర్ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. పరుగుపందెం పోటీ వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాలల సమీపంలోని రింగురోడ్డు ప్రాంతంలో నిర్వహించనున్నారు.
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాలని..
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఈ ఎంపికలకు వచ్చా. ప్రస్తుతం డిగ్రీ చేస్తూ మరోవైపు పోలీసు ఉద్యోగానికి శిక్షణ పొందుతున్నా. ఎయిర్‌ఫోర్స్‌లో ఎంపికలు రాయలసీమ ప్రాంతంలో జరుగుతుండటంతో ఇక్కడికి వచ్చా.
– అశోక్, మద్దికెర, కర్నూలు జిల్లా
మామ ప్రోత్సాహంతో..
మామయ్య ఆర్మీలో ఉంటూ దేశానికి సేవచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో త్రివిధ దళాల్లో పనిచేయాలన్న సంకల్పం నాలో ఉంది. ఇందులో భాగంగా కడపలో నిర్వహించే రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వచ్చా. మెడికల్ అసిస్టెంట్ పోస్టు సాధించేందుకు ఈ ఎంపికల్లో పాల్గొంటున్నా.
– రాజేష్, ఉరవకొండ, అనంతపురం జిల్లా
శిక్షణ తీసుకుని సన్నద్ధమయ్యా..
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం శిక్షణ పొందాను. గతంలో కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంపికలకు వెళ్లా. దేశం కోసం సేవ చేసే అవకాశం ఉండటంతో ఈ రంగంలో ఉద్యోగం చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నా.
– సుబ్బరంగారెడ్డి, శివాపురం, మార్కాపురం, ప్రకాశం జిల్లా.
మహిళలకు అవకాశం లేకపోవడం విచారకరం..
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశాలు అంటే ఇక్కడి వచ్చాం. అయితే ఎయిర్‌ఫోర్స్‌లో ప్రస్తుతం నిర్వహించే ఎంపికలు కేవలం పురుషులకు మాత్రమే అని తెలియజేశారు. మహిళలకు కూడా అవకాశం కల్పిస్తే బాగుండేది. ప్రస్తుతం కానిస్టేబుల్ పోస్టు కోసం శిక్షణ పొందుతున్న మాకు ఇటువంటి ఎంపికల్లో పాల్గొనడం ద్వారా భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని ఇక్కడి వచ్చా.
– ఎం. లక్ష్మిపార్వతి, అంకిరెడ్డిపల్లి, కర్నూలు జిల్లా
పారదర్శకంగా ఎంపికలు...
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఎంపికలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమపద్ధతిలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఉద్యోగాల కోసం వచ్చే అభ్యర్థులు క్రీడాస్ఫూర్తి కలిగిఉండాలి. ఎంపిక కాని వారు నిరుత్సాహానికి గురికాకుండా మరోసారి ఎంపికయ్యేందుకు ప్రయత్నం చేయాలి.
– డి.కె. చౌదరి, వింగ్ కమాండర్, సికింద్రాబాద్
అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం..
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో, సంయమనంతో వ్యవహరించాలి. బయటి చెప్పే పుకార్లను నమ్మవద్దు. అర్హత కలిగిన అభ్యర్థులందరినీ ఎంపిక చేస్తారు.
– మమత, స్టెప్ సీఈఓ, కడప
అపరిమిత అవకాశాలు.. అందిపుచ్చుకోండి..
ఈ ఎంపికల్లో ఉద్యోగాల సంఖ్య అపరిమితం.. అర్హత కలిగిన అభ్యర్థులందరినీ ఎంపిక చేస్తారు. అన్ని రకాల ధ్రువపత్రాలతో అభ్యర్థులు హాజరై తమ సామర్థ్యం ప్రదర్శించి ఎంపికల్లో పాల్గొనవచ్చు. ఆకాశమే హద్దుగా ఉన్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి.
– కె.వి. సత్యనారాయణ, జిల్లా కలెక్టర్