‘రైతులు ఆందోళన చెందొద్దు’
బాల్కొండ : ఈ ఏడాది పీ.టీ.ఎస్–10 రకం పసుపు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యనవన శాఖ డీడీ సునంద రాణి పేర్కొన్నారు. గురువారం ఆమె జలాల్‌పూర్‌లో పసుపు పంటను పరిశీలించారు. రైతులకు పంట సాగులో సలహాలు, సూచనలు ఇచ్చారు. పీ.టీ.ఎస్–10 రకం పసుపు పూర్తి స్థాయిలో మొలకెత్తడం లేదని రైతులు ఆందోళన చెంద వద్దన్నారు. సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని, కొన్నాళ్లు కోల్డ్ స్టోరేజీలో ఉంచడం వల్లే ఇప్పటికిప్పుడు మొలకెత్తలేకపోతోందన్నారు. మెల్లమెల్లగా మొలకలు వస్తాయని పేర్కొన్నారు. ఆలస్యంగానైనా విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తే అవకాశం ఉందన్నారు. బెడ్ విధానంలో సాగు చేయడంతో ఎకరానికి 29 వేల మొక్కలు సరిపోతాయన్నారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండడం వల్ల పసుపు పంటకు దుంపకుళ్లు సోకే ప్రమాదం ఉందన్నారు. అందుకే రైతులు ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి, 2 కిలోల సూడోమోనాస్, 2 కిలోల పొటాష్, 2 కిలోల పీ.ఎస్.బి బాగా మాగిన పశువుల ఎరువులో వేప పిండితో కలిపి చల్లుకోవాలని సూచించారు. ఆమె వెంట ఏడీ శ్రీధర్ రావు, హెచ్‌ఈవో విద్యాసాగర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.