‘డబుల్‌’ నిరాశ | doble dispointed | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ నిరాశ

Published Wed, Aug 10 2016 9:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

‘డబుల్‌’ నిరాశ

‘డబుల్‌’ నిరాశ

  • కదలని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపథకం
  • ఇళ్లనిర్మాణానికి ముందుకురాని కాంట్రాక్టర్లు
  • కేవలం ముల్కనూరులో 200 ఇళ్లకు పునాదులు
  • మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువు
  • గ్రామాల యూనిట్‌గా టెండర్లకు కలెక్టర్‌ ఆదేశాలు
  • ముకరంపుర : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న చిన్నముల్కనూరులో తప్ప మరెక్కడా పునాదులు పడలేదు. జిల్లావ్యాప్తంగా 5200 ఇళ్లు మంజూరు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయగా, చిన్నముల్కనూరులో మాత్రమే 200 ఇళ్ల నిర్మాణ పనులు మెుదలయ్యాయి. ఇప్పటికే మూడుసార్లు టెండర్లు పిలిచినా యూనిట్‌ కాస్ట్‌ గిట్టుబాటు కాదనే కారణంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.  
    ఒక్కో సెగ్మెంట్‌కు 5200.. 
    2015–16 సంవత్సరానికి ప్రభుత్వం జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున 13 నియోజకవర్గాలకు 5200 ఇళ్లను మంజూరు చేసింది.  గ్రామీణ ప్రాంతాల్లో 3920 ఇళ్లు, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, కోరుట్ల, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల పట్టణాల్లో 1280 ఇళ్లు కేటాయించింది. వీటికోసం 190 గ్రామాలు, పట్టణాల్లో అధికారులు స్థల సేకరణ చేపట్టారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా 83,352 మంది దరఖాస్తు చేసుకున్నారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను విచారించి లబ్ధిదారులను ఎంపిక చేయడం అధికారులకు తలకుమించిన భారమైంది. ఓవైపు నేతల పైరవీలు, మరోవైపు అనర్హుల ఎంపికతో రసాభాసగా మారింది. ఇప్పటివరకు 154 గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా, మరో 32 గ్రామాల్లో ఎంపిక ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. 
    చిన్నముల్కనూరులో కొలిక్కి...
    సీఎం దత్తత గ్రామం చిన్నముల్కనూరులో మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. చివరకు నాలుగోసారి టెండర్లు పిలువగా.. మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఈ గ్రామానికి 247 ఇళ్లు మంజూరు చేయింది. అయితే 204 ఇళ్లకు మాత్రమే ఆర్‌అండ్‌బీ అధికారులకు ప్రతిపాదనలు అందాయి. ఇందులో ప్రస్తుతం 200 ఇళ్లకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. మిగిలి ఇళ్ల నిర్మాణాలను మెుదలు పెట్టాల్సి ఉంది. 
    ముందుకు రాని కాంట్రాక్టర్లు 
    జిల్లాకు మంజూరైన ఇళ్ల నిర్మాణాల కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు యూనిట్‌ కాస్ట్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు కాంపౌండ్‌వాల్, ఇతరత్రా పనులకు ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షలు అదనంగా కేటాయించింది. అయితే ప్రభుత్వం నిర్దేశించి నమూనా ప్రకారం నిర్మించాలంటే ఒక్కో ఇంటికి రూ.8లక్షలు ఖర్చవుతుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నష్టం భరించి ఇళ్లు కట్టలేమని చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం యూనిట్‌ కాస్ట్‌ను పెంచేలా కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. దీంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 
    గ్రామాల వారీగా టెండర్లు
    నియోజకవర్గాల వారీగా టెండర్లు పిలవడంతో చిన్న కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని గ్రహించిన కలెక్టర్‌ నీతూప్రసాద్‌ గ్రామాల వారీగా టెండర్లు పిలవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా 20–30 ఇళ్లకు టెండర్లు పిలిస్తే చిన్న కాంట్రాక్టర్లు ముందుకు వస్తారని  అధికారులు భావిస్తున్న అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు చిన్నముల్కనూరు మినహా మరెక్కడా టెండర్లు కాలేదని ఆర్‌అండ్‌బీ ఈఈ రాఘవాచార్యులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement