యాడికి :
పవర్‌లూమ్స్‌ను అరికట్టకపోతే చేనేతలకు ఆత్మహత్యలే శరణ్యమని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు ఆవేదన చెందారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం యాడికిలో నిర్వహించిన చేనేతల మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
పవర్‌లూమ్స్ రాకతో చేనేత వృత్తి పూర్తిగా అంతరించిపోతోందన్నారు. జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిల్క్‌హౌస్‌ల పేరుతో పవర్‌లూమ్స్ చీరలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, చేనేతల రుణమాఫీని అమలు చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహశీల్దార్ కుమారస్వామికి వినతిపత్రం ఇచ్చారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మామిళ్ల నారాయణస్వామి, మండల అధ్యక్షుడు మోహన్, అభివృద్ధి వేదిక కన్వీనర్ కులశేఖర్‌నాయుడు, సీపీఎం పట్టణ కార్యదర్శి బషీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.