
సిరిసిల్లలో మాట్లాడుతున్న సాయిబాబా
- ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు
- పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారు
- మంత్రుల, ఎమ్మెల్యే జీతాలు పెంచుకున్నారు
- ప్రజాధనం తింటే నేతలకు అరగదు
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా
సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సందర్శనకు, దర్శనం ఇవ్వడంలేదని గతంలో సీఎంలు వైఎస్సార్, రోషయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు నిత్యం ప్రజలను కలిసేందుకు సమయమిచ్చేవారిని, ప్రజల బాధలు తెలుసుకునేవారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సీఐటీయూ జిల్లా 7వ మహాసభల్లో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలిసి కేంద్రం చేసే చట్టాల విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారని సాయిబాబా వివరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన పరిశ్రమల విధానంలో కార్మిక సంఘాల అభిప్రాయాలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం పార్లమెంట్‌లో ఆమోదించినపుడు ఎంపీగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు నిర్వాసితులకు ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని సాయిబాబా అన్నారు. గతంలో సీఎంలాగే కేసీఆర్ సైతం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని, కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని సీఐటీయూ కోరుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచుకున్నారని ఆరోపించారు. ప్రజాధనం తింటే అరగదని, కార్మికుల పొట్టలు నింపాలని సాయిబాబా కోరారు. సిరిసిల్లలో కార్మికులు 12 గంటలు మరమగ్గాల్లో పని చేస్తున్నారని ఇది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే.. ఓటీ ఇవ్వాలనే నిబంధనలు యజమానులు పట్టించుకోవడం లేదన్నారు. పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదని సాయిబాబా ఆరోపించారు. అమెరికా, దుబాయ్ వెళ్లివచ్చిన కేటీఆర్ అక్కడ కార్మికుల కనీస వేతనాలు ఎంతో గమనించలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లలో కార్మికులకు చేసిందేమీ లేదని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయలేదని, కనీస వేతనాలు పెంచలేదని సాయిబాబా ఆరోపించారు. కార్మికుల సంక్షేమం విషయంలో సోయి తెచ్చుకుని పని చేయాలని ఆయన కోరారు.