
కలుషిత నీరు తాగితే కైలాసానికే
♦ 45 గ్రామాల గిరిజనులకు చెలమ నీరే శరణ్యం
♦ తాగునీటి సదుపాయాలు శూన్యం
♦ మంజూరు కాని మంచినీటి పథకాలు
అక్కడి గిరిజనులు విషంతో సమానమైన కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది. ఆ నీటిని తాగితే ప్రమాదకరమైన రోగాలు, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తాయని తెలిసినా దాహం తీర్చుకునేందుకు మరో దారిలేక ఆ నీటినే తాగుతున్నారు. వేసవిలో కాలువలు ఎండిపోవడం వల్ల గిరిజనులు చెలమలు తీస్తారు. ఆ నీటిలో ఆకులు పడి కుళ్లిపోయి కలుషితంగా మారుతుంది. మరో గత్యంతరం లేక సుమారు 45 గ్రామాల్లో ఆదివాసీలు ఇలా చెలమల్లో కలుషిత నీటినే సేవిస్తున్నారు. తాగునీటి పథకాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు వాటికి మోక్షం కలగలేదు.
కొయ్యూరు: మండలంలోని పలు గిరి గ్రామాల్లో తాగునీటి సదుపాయాలు లేక గిరిజనులు కలుషిత నీటిని తాగి రోగాలబారిన పడుతున్నారు. వేసవి వస్తే కాలువలు, గెడ్డల్లో నీరు ఇంకిపోతుంది. నీటి నిల్వలు ఉన్నచోట చెలమలు తీస్తారు. దానిలో ఎండిన ఆకులు, చెత్త పడుతుంది. అవి రోజుల తరబడి నిలిచిపోయి కుళ్లిపోవడంతో నీరు కలుషితమవుతుంది. గిరిజనులకు తాగునీటి వసతులు లేక ఆ నీటిని తెచ్చుకుని తాగేందుకు, వంటకు వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ నీటిని తాగిన తర్వాత వాంతులు, విరేచనాలు పట్టుకుంటాయి. సమయానికి వైద్యం అందకుంటే ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా నెలకొంటాయి. గతంలో కలుషిత నీటిని తాగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఎం.భీమవరం పంచాయతీ పరిధిలోని కాకులమామిడి, జ్యోతులమామిడి, పుట్టకోట, పెదలంక, కొత్తూరు, బొబ్బిలికొండ, మైనకోట, బుగ్గురాయి గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సదుపాయాలు లేకపోవడంతో కలుషిత నీరే వారికి ఆధారం. ఆయా గ్రామాలకు రహదారి లేకపోవడంతో బోర్లు వేసేందుకు రిగ్గులు వచ్చే అవకాశం లేదు. యూ.చీడిపాలెం పంచాయతీ పరిధిలోని నక్కలమెట్ట, డబ్బలంక, నీలవరం,గంగవరం,పాలసముద్రం, మర్రిపాకలు, ఈదులబంద, సంగమవలస, ఎండకోట, గొంధికోట, రేవులకోట, రేవులకోట కంఠారం, జెర్రిగొంధితో పాటు బూదరాళ్ల పంచాయతీలో 15 గ్రామాల్లోని ఆదివాసీలు చెలమ నీటిని తాగుతున్నారు. వర్షాకాలంలో కాలువలో బురదనీటిని తాగాల్సిన పరిస్థితి.
ప్రతిపాదనలతో కాలయాపన
మండలంలో 168 గ్రామాల్లో తాగునీటి పథకాలను నిర్మించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రెండేళ్లు కావొస్తున్నా ఇంతవరకు ఒక్కటీ మంజూరు కాలేదు. దీంతో గిరిజనులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల బావులు తవ్వినా నిరుపయోగంగా ఉన్నాయి. గ్రావిటీ పథకం ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలున్నా ఆదిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.
మరగబెట్టకుంటే మరణమే..
ఇక్కడ కాలువ నుంచి తీసుకు వస్తున్న కలుషిత నీటిని ఇంటి వద్ద మరగబెట్టుకుని తాగుతాం. తెచ్చిన నీటిని మరగబెట్టకుండా తాగితే వెంటనే వాం తులు, విరేచనాలు పట్టుకుంటాయి. ఈ ప్రాంతంలో నీరు కలుషితంగా మారింది. రక్షిత నీరు అందించాలని కోరినా ఫలితం లేకపోయింది. -వి.అప్పారావు, జ్యోతులమామిడి
వేసవిలో ఇబ్బందే
ప్రస్తుతం కాస్తున్న ఎండలకు కాలువలో నీరు క్రమేపీ ఎండిపోతోంది. కొన్నిరోజుల్లో ఉన్న నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుంది. గుక్కెడు నీటికి ఎన్నో పాట్లు పడుతున్నాం. మరోదారిలేక కలుషిత నీటిని తాగాల్సివస్తోంది. - కె.కేశవరావు, కాకులమామిడి