తూనీగ.. తూనీగ..!
వేలేరుపాడు : తూనీగ తూనీగ.. ఎందాక పరుగెడతావే...రావే మా వంక... అన్నాడో సినీకవి. ఆయన భావం ఎలా ఉన్నా... ప్రస్తుతం తూనీగలు మనవంక రాలేకపోతున్నాయి. ఒకప్పుడు వర్షాకాలం ప్రారంభమైతే చాలు రివ్వు రివ్వుమని ఎగురుతూ సందడి చేసే తూనీగలు నేడు ఎక్కడోగానీ కన్పించడం లేదు. సీతాకోక చిలుకల రంగుల మాదిరిగా తూనీగల్లో 12 రకాల రంగులు చిన్న, పెద్ద సైజుల్లో ఉంటాయి. వివిధ రంగుల్లో శోభాయమానంగా ఎగిరే వీటి రెక్కల్లో తరిచిచూస్తే అందమైన బాల్యస్మృతులు గుర్తుకు వస్తాయి. వీటిని పట్టుకొని ఆటలాడుకున్న బాల్యం తెరలుతరెలుగా కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.
తక్కువ ఎత్తులో ఎగిరితే వర్షాలు
ఇవి భూమికి తక్కువ ఎత్తులో ఎగిరితే వర్షాలు తొందరగా పడతాయని, అదే భూమికి దూరంగా ఎగిరితే ఆలస్యం తప్పదని రైతులు నమ్మేవారు. సాధారణంగా తూనీగలు నీటి మడుగుల ప్రాంతంలో ఉన్న చెట్ల ఆకుల కిందివైపు భాగంలో గుడ్లు పెడతాయి. చెట్ల ఆకుల కింది భాగంలో అయితే తేమ తగిలి చల్లదనం ఉంటుంది. దీని వల్ల గుడ్లు వృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఆ చల్లదనం గుడ్ల పొదగుకు అనుకూలించడం లేదు. వాయువుల ప్రభావం, అవసరానికి మించి అధిక ఉష్ణోగ్రతల వల్ల 100 శాతం గుడ్లలో 80 శాతం గుడ్లు పొదుగుదశలో నశించిపోతున్నాయి. దీంతో వీటి ఉత్పత్తి శాతం తగ్గిపోతోంది. పొలాల్లో ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం కూడా ఈ కీటకాల మనుగడకు శాపంగా మారింది.