ఎండుతున్న ఆశలు
♦ చిత్తవుతున్న బత్తారుు రైతులు
♦ నీరులేక ఎండుతున్న వేల ఎకరాల పంట
♦ ఈ సీజన్లో 5 వేల ఎకరాల్లో చెట్ల నరికివేత
♦ వంట చెరకుగా వాడుతున్న వైనం
ఒకప్పుడు సిరులు పంచిన బత్తారుు సాగు నేడు రైతుకు కన్నీరు మిగులుస్తోంది. వర్షాలు అరకొరగానే పడుతున్నాయి. పాతాళగంగ అదఃపాతాళానికి చేరింది. 900 అడుగుల బోరు వేసినా నీటి చెమ్మ తగలడం లేదు. నెలకు ఒక్క తడికి కూడా నోచుకోక వేల ఎకరాల్లో బత్తారుు చెట్లు నిలువునా ఎండిపోతున్నారుు. ఒక్క ఈ సీజన్‌లోనే 5 వేల ఎకరాల్లో చె ట్లను నరికేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది.
అర్ధవీడు: జిల్లాలో బత్తాయి తోటలకు గిద్దలూరు నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది. నిత్యం 50 నుంచి 100 లారీల బత్తాయి కాయలు హైదరాబాద్, విజయవాడ, పూనా, నాగపూర్, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు తరలించేవారు. తోటలో పూతదశ వచ్చినపుడే రైతుకు వడ్డీ లేకుండా బత్తాయి వ్యాపారులు ఎకరాకు లక్ష దాకా అడ్వాన్సులిచ్చేవారు. ఎకరాకు రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా ఏడాదికి ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. చెట్లను కాపాడుకోలేక చేతికి వచ్చిన చెట్లను నరికేస్తున్నారు. భూగర్భ జలం అడుగంటడంతో వేల ఎకరాలు ఎండిపోయూరుు. ఎండిన చెట్లను నరికి వంట చెరకుగా అమ్ముకుంటున్నారు. నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో 40 వేల ఎకరాల్లో బత్తారుు సాగు చేస్తున్నారు. నీరందక ఈ సీజన్లోనే సుమారు 5 వేల ఎకరాల్లో చెట్లను కొట్టేశారు.
బత్తాయి సాగు ఇలా
ఎకరానికి 100 బత్తాయి మొక్కలు నాటి, ఐదేళ్లు సంరక్షించిన తర్వాత పంటకొస్తాయి. రైల్వే కోడూరు నుంచి నాణ్యమైన శ్రీరంగాపూర్ మొక్కలు తెప్పించి నాటుతారు. ఎకరాకు 4 నుంచి 8 టన్నుల దాకా కాపు వస్తుంది. సంవత్సరంలో రెండు సీజన్‌లుగా పంట చేతికొస్తుంది. ఏప్రిల్ నెల నుంచి వచ్చే కాపును చిత్తకాపు అంటారు. ఇటీవల టన్ను ధర రూ.42 వేలు పలికింది. జూలై నెలలో వచ్చే పంటను సీజన్ కాపు అంటారు. సీజన్ కాపు టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా ధర పలుకుతుంది. ఒకప్పుడు మోతుబరి రైతులుగా ఉన్న బత్తాయి రైతులు నేడు కూలి పనులకు వెళ్తున్నారు.
చెట్లను కాపాడుకునేందుకు బోర్లు వేయడం, నీరు పడకపోవటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, కొమరోలు, రాచర్ల మండలాల్లో వేల ఎకరాల్లో బత్తాయి సాగు చేశారు. నేడు చెట్లన్నీ ఎండిపోవటంతో అక్కడక్కడా బత్తాయి తోటలు కొన్ని మాత్రమే మిగిలాయి. ఒక్కొక్క రైతు చెట్లను కాపాడుకొనేందుకు 600 నుంచి 900 అడుగుల లోతు వరకు బోర్లు వేశారు. అయినా చుక్క నీరు పడకపోవటంతో చెట్లను కాపాడుకోలేక అప్పులు కట్టలేక నేడు వారి పరిస్థితి దయనీయంగా ఉంది.
ప్రభుత్వమే ఆదుకోవాలి: 2007-2008 సంవత్సరంలో వచ్చిన కరువుకు బత్తాయి తోటలు ఎండిపోయినపుడు ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసింది. అప్పుటి కడప జిల్లా కలెక్టర్ అజయ్‌జైన్ బత్తాయి రైతుల పరిస్థితి చూసి నష్ట పరిహారం అందేలా నివేదిక తయారు చేసి పంపడంతో స్పందించిన ప్రభుత్వం బత్తాయి రైతులకు నష్ట పరిహారం అందజేసింది. ఈ ఏడాది కూడా ఎండిపోయిన బత్తాయి రైతులకు పరిహారం అందించాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఎండిన తోటలకు నష్ట పరిహారం అందించాలి
5 ఎకరాల బత్తాయి సాగు చేశాను. 10 బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. ఐదేళ్లు సంరక్షించి, పంట దశ కొచ్చిన బత్తాయి తోట నిలువునా ఎండిపోయింది. పసిపిల్లలను సాకినట్లు కాపాడుకున్నా ఫలితం లేదు. మండలంలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన బత్తాయి తోటల రైతులకు నష్టపరిహారం అందించాలి. - వీరారెడ్డి, బత్తాయి రైతు
బత్తాయి రైతులను ఆదుకోవాలి
బత్తాయి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో తోటలపై లాభాలు ఆర్జించిన రైతులు నేడు అప్పులపాలయ్యారు. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన బత్తాయి తోటల రైతులకు నష్ట పరిహారం అందజేయాలి. - ఎస్.ఎం.బాషా