డ్రగ్స్ మాఫియాకు కేంద్రబిందువుగా నెల్లూరు
-
నిందితుల అరెస్ట్‌తో గుట్టురట్టు
-
పోలీసుల అదుపులో జిల్లా వాసి
-
విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారం?
నెల్లూరు(క్రైమ్):
ప్రశాంతతకు మారుపేరైన సింహపురిలో అశాంతి రాజ్యమేలుతోంది. డ్రగ్స్‌మాఫియాకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటి వరకు వివిధ మార్గాల్లో గంజాయి జిల్లాకు చేరుతుండగా తాజాగా కొకై¯న్, హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు నగరానికి చేరుతున్నాయి. హైదరాబాద్ జీడిమెట్ల పోలీసులకు ఓ నిర్మాత, సహనిర్మాతలు డ్రగ్స్ సరఫరాచేస్తూ పట్టుబడడంతో జిల్లా పేరుతెరపైకి వచ్చింది. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు నగరంలోనే సుమారు లక్షమంది విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరగా తీసుకున్న అక్రమార్కులు గంజాయితో పాటు డ్రగ్స్‌ను సైతం సరఫరాచేస్తూ వారిని మత్తులోకి దించి, జీవితాలతో ఆటలాడుకుటున్నారు.
నెల్లూరులో ఇతర దేశాల యువత..
మరోవైపు సూడాన్, నైజీరియా, చైనా తదితర దేశాలకు చెందిన యువత సైతం నెల్లూరులో ఉంటూ వివిధ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరు పలు సెజ్‌ల్లో సైతం పనిచేస్తున్నారు. వీరిలో కొందరు మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారు. సహచర విద్యార్థులను సైతం మత్తు ఉచ్చులోకి లాగుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో మత్తు కల్గించే సిగిరెట్లు చెన్నై, ముంబయి, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలోనూ నెల్లూరుకు చెందిన సుబ్రమణ్యరాజ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో మత్తు పదార్థాలను కొనుగోలు చేసి వాటిని నెల్లూరుకు తీసుకొచ్చి విద్యార్థులకు గ్రాము రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయించి సొమ్ముచేసుకోవడం ప్రారంభించాడు. 2014 జనవరి ఏడోతేదిన మత్తుపదార్థాల కొనుగోలుకు హైదరాబాద్‌కు వెళ్లగా సైబరాబాద్ ప్రత్యేక బృందం అతడ్ని అరెస్ట్ చేసింది. దానిపై స్పందించిన అప్పటి ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ నిందితుడి వద్ద సేకరించిన సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్‌మాఫియాపై దృష్టిసారించారు. ఆయన బదిలీ అనంతరం అది మరుగున పడిపోయింది. తాజాగా జీడిమిట్ల పోలీసులు ఓ నిర్మాత, సహనిర్మాతను అరెస్ట్‌చేయడంతో జిల్లా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.
ఎలా బయటపడిందంటే..
హైదరాబాద్‌లో శనివారం జీడిమిట్ల పోలీసులు ఓ నిర్మాత, సహనిర్మాతను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కేజీ కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం వారిని విచారించగా నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు చెందిన ఎం.శ్రీహరిరెడ్డికి అక్రమ వ్యవహారంలో పాత్ర ఉందని తేలింది. దీంతో వారి సమాచారం మేరకు శనివారం నెల్లూరు పోలీసులు నెల్లూరు ప్రధానరైల్వేస్టేషన్ వద్ద సదరువ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. అతని వద్ద నుంచి కెటామైన్ అనే మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం శ్రీహరిరెడ్డి మూడోనగర పోలీసుస్టేషన్ పరిధిలో నివాసముంటూ ఈ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై నగర డీఎస్పీ జి. వెంకటరాముడను వివరణ కోరగా జీడిమెట్ల పోలీసుల సమాచారం మేరకు నగరానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని త్వరలోనే నిజనిజాలు వెల్లడిస్తామని చెప్పారు.