
ఏప్రిల్ చివర్లో డీఎస్సీ నోటిఫికేషన్?
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. జూన్‌లో పరీక్ష నిర్వహించి జూలై నెలాఖరుకల్లా నియామకాలను పూర్తి చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. ఈలోగా అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టెట్, డీఎస్సీ రెండూ కలిపి నిర్వహించాలా? వేరుగా నిర్వహించాలా? అన్న అంశాలను తేల్చడంతోపాటు వాటికి అవసరమైన నిబంధనలను కొత్తగా రూపొందించుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.
ఈ ప్రక్రియ మొత్తానికి సమయం పడుతుందని, పైగా ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గరపడినందున ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లంతా పరీక్షకు సిద్ధమయ్యేందుకు సెలవులుపెట్టి వెళ్లిపోతారని...దీంతో విద్యా బోధన దెబ్బతింటుందన్న అంశంపైనా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పట్లో టెట్‌గానీ, డీఎస్సీ గానీ నిర్వహించవద్దని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సైతం విద్యాశాఖకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
3 రోజుల్లోగా ఖాళీల వివరాలివ్వాలి: డిప్యూటీ సీఎం
డీఎస్సీ ప్రక్రియకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, డెరైక్టర్ కిషన్, విద్యాశాఖ, బీసీ సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, బీసీ సంక్షేమశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలోని పాఠశాలలు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, అప్‌గ్రేడ్ చేయాల్సిన పోస్టులు, అదనంగా సృష్టించాల్సిన పోస్టులు, ఆయా పాఠశాలలు, గురుకులాల్లో అవసరాలను పేర్కొంటూ పోస్టులకు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను మూడు రోజుల్లోగా అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లలో 11 వేలకుపైగా ఖాళీలు ఉండగా సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, బీసీ సంక్షేమశాఖ పరిధిలోని గురుకుల పాఠశాలలు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాల్లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆయా శాఖల్లో మొత్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలతోపాటు కొత్తగా సృష్టించాల్సిన పోస్టుల సంఖ్య, కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలు, రెగ్యులరైజేషన్ చేయాల్సిన వారి సంఖ్య, పాఠశాల విద్యాశాఖలోని సర్‌ప్లస్ పోస్టుల సంఖ్య వంటి సమగ్ర వివరాలతో నివేదికలు అందజేయాలని కడియం ఆదేశించారు. మార్చి 31 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతోపాటు మొత్తంగా ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్న వివరాలను సమర్పించాలన్నారు. నివేదిక అందాక సీఎంతో చర్చించి డీఎస్సీ నోటిఫికేషన్ జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.