![పులిగడ్డ జాలరి వలలో డేగముక్కు తాబేలు](/styles/webp/s3/article_images/2017/09/3/71454798545_625x300.jpg.webp?itok=24koCiGp)
పులిగడ్డ జాలరి వలలో డేగముక్కు తాబేలు
అవనిగడ్డ: ఒడిశా, శ్రీకాకుళం తీరప్రాంతంలోని సముద్రంలో జీవించే అరుదైన డేగముక్కు తాబేలు శనివారం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలో జాలరి వలలో చిక్కింది. పులిగడ్డకు చెందిన పీతా లవయ్య అక్విడెక్టు కింద వలతో చేపలు పడుతుండగా ఈ తాబేలు పడింది. వింతగా ఉండడంతో దాన్ని తీసుకొచ్చి పులిగడ్డ చేపల మార్కెట్ వద్ద ఐస్‌బాక్సు లో ఉంచాడు. సాధారణ తాబేలు వలె కాకుండా ముందు రెక్కలు ఉన్న దీనికి కాళ్లు, తల, రెక్కలు డిప్పలోపలికి వెళ్లకుండా బయటే ఉన్నాయి.
కళ్లు పెద్దవిగా మనిషి కళ్లను పోలి ఉన్నాయి. డిప్ప గడుగడులుగా ముదురు గోధుమ రంగులో ఉంది. మూడడుగుల వెడల్పు, నాలుగడుగుల పొడవు ఉన్న ఈ తాబేలు 18 కిలోల బరువుందని లవయ్య చెప్పారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు రేంజ్ అధికారి భవాని ఆదేశాల మేరకు సిబ్బంది శ్రీనివాసరావు ఈ తాబేలును స్వాధీనం చేసుకుని పాలకాయతిప్ప శివారు సాగరసంగమం వద్ద సముద్రంలో వదిలారు. ఒడిశా, శ్రీకాకుళం తీరప్రాంతంలోని సముద్రంలో లోతైన ప్రాం తంలో ఈ డేగముక్కు తాబేలు జీవిస్తుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి భవాని చెప్పారు.