నేలతల్లి సంరక్షణ..అందరి బాధ్యత
– వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): నేలతల్లి సంరక్షణ అందరి బాధ్యత అని వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి తెలిపారు. సోమవారం కర్నూలు వ్యవసాయశాఖ సహాయ సంచాలకుల కార్యాలయ ప్రాంగణంలో ప్రపంచ నేల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 48 మండలాల్లో సేంద్రియ పదార్థాలు తగ్గిపోవడం అందోళన కలిగించే విషయమన్నారు. భాస్వరం, పొటాష్ ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడడమే ఇందుకు కారణమన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో వ్యవసాయ శాఖ విఫలం అయిందన్నారు. నేడు భూములు సిమెంటు రోడ్ల తరహాలో గట్టి పడిపోయాయని, నీళ్లు ఇంకింప చేసుకునే గుణం లేకుండా పోయిందని వివరించారు. నేల ఆరోగ్యం కాపాడేందుకు వ్యవసాయశాఖ, రైతులు కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విధిగా పచ్చిరొట్ట ఎరువులను వాడాలని సూచించారు. ఈ ఏడాది 42 లక్షల భూసార పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ.. నేల ఆరోగ్యంగా ఉన్నపుడే మనందరి ఆరోగ్యం బాగుంటుందన్నారు. జిల్లాలోని భూముల్లో జింక్, బోరాన్ పూర్తిగా లేకుండా పోయిందని ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ శేషారెడ్డి తెలిపారు.సమావేశంలో డీడీఏ(పీపీ) మల్లికార్జునరావు, కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఆత్మకూరు ఏడీఏ సాలురెడ్డి, ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి, కర్నూలు, కల్లూరు, సి.బెళగల్, గూడూరు, కోడుమూరు వ్యవసాయాధికారులు అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, సురేష్‌బాబు, విజయకుమార్, అక్బరుబాష తదితరులు పాల్గొన్నారు.