ఆలయాల్లో ఆర్థిక సంస్కరణలు
శ్రీశైలం: ఆలయాల్లో ఆర్థిక సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర గవర్నర్ తరఫున రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి జెఎస్వీప్రసాద్, జీఓ( ఆర్టీనెం 1098)ను జారీ చేశారు. నవంబర్ 15 నుంచి 2017 మార్చి 31లోగా ఆర్థిక సలహాదారులు కసరత్తు పూర్తి చేసి ఏయే సంస్కరణలో చేయాలో సూచించాలన్నారు. సంస్కరణలపై పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం ముగ్గురు ఆర్థిక నిపుణులను ఆర్థిక సలహదారులు నియమించుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్థికసలహాదారులు, దేవాదాయ కమిషనర్, ఐటీ ప్రాజెక్టు ఉన్నతాధికారిలతో కలిసిన హైలెవెల్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతినెలా ఆయా దేవాలయాల ఆర్థిక పురోభివృద్ధిపై నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నిపుణుల కమిటీ ఏడు దేవాలయాలను సందర్శిస్తుందని, ఒక్కొక్క దేవస్థానంలో రెండు, మూడురోజులు ఉండి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తుంది. పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించిన తరువాత శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ కనకదుర్గ, ద్వారక తిరుమల, అన్నవరం, సింహచలం దేవాలయాల్లో ఈ సంస్కరణలను అమలు చేయనున్నారు. డిసెంబర్‌లోగా నిపుణుల కమిటీని ఏడు దేవాలయాలు నియమించుకుంటే జనవరి 2017 ట్రయల్ రన్ ప్రారంభించే అవకాశం ఉంది.